పింఛన్‌కు ప్లస్‌లూ ఉంటాయి | pension schemes benifits | Sakshi
Sakshi News home page

పింఛన్‌కు ప్లస్‌లూ ఉంటాయి

Published Sun, Sep 1 2013 1:23 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM

పింఛన్‌కు ప్లస్‌లూ ఉంటాయి

పింఛన్‌కు ప్లస్‌లూ ఉంటాయి

పెన్షన్ అనగానే గుర్తుకొచ్చేది బీమా పథకాలే. ప్రస్తుతం బీమా కంపెనీలు రెండు రకాల పెన్షన్ పథకాలను అందిస్తున్నాయి. స్టాక్, మనీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే యులిప్ పెన్షన్ పథకాలు ఒకటైతే సంప్రదాయ పెన్షన్ పథకాలు మిగతావి. రిటైర్మెంట్ నిధి సమకూర్చుకునేటప్పుడు రిస్క్ ఎందుకులే అనుకుంటే సంప్రదాయ బీమా పథకాలు చాలా ఉత్తమం. సంప్రదాయ పెన్షన్ బీమా పథకాల్లో ఉండే ప్రయోజనాలేమిటో ఇప్పుడు చూద్దాం...
 
 రక్షణాత్మకమైన రాబడి
 ఈ పథకాలు గ్యారంటీతో కూడిన రక్షణాత్మకమైన రాబడులను అందిస్తాయి. ఈ పథకాలపై ఏటా అందించే బోనస్‌లు, అదనపు బోనస్‌లను మెచ్యూరిటీ లేదా క్లెయిమ్ సమయంలో ఒకేసారి చెల్లిస్తారు.
 
 తీసుకోవడం సులభం
 ఇతర పాలసీలతో పోలిస్తే పెన్షన్ పథకాల జారీ చాలా సులభం. చాలా బీమా కంపెనీలు ఆరోగ్య పరిస్థితితో సంబంధం లేకుండా ఎటువంటి వైద్య పరీక్షలు అవసరం లేకుండానే పెన్షన్ పథకాలను జారీ చేస్తున్నాయి.
 
 నెలవారీ ఆదాయం
 పాలసీ గడువు తీరాక వచ్చిన మొత్తాన్ని యాన్యుటీ పథకంలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు యాన్యుటీ పథకం జీవిత కాలం హామీతో కూడిన ఆదాయాన్ని ప్రతీ నెలా అందిస్తుంది. దీని వలన రిటైర్మెంట్ తర్వాత ఉండే అవసరాలకు ఈ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. అంతేకాదు రిటైర్మెంట్ తర్వాత వయస్సుతో పాటు ఆరోగ్య సమస్యలు పెరుగుతుంటాయి. ఇలాంటి అత్యవసర సమయాల్లో పెన్షన్ పథకాలు అక్కరకొస్తాయి.
 
 పన్ను ప్రయోజనాలు
 పెన్షన్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం లక్ష రూపాయల వరకు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. అధిక మొత్తంలో పెన్షన్ కావాలనుకునే వాళ్లు ఈ పరిమితిని దాటి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కేవలం లక్ష రూపాయల వరకు పన్ను ప్రయోజనాలు లభించినా రిటైర్మెంట్ తర్వాత కావల్సినంత పెన్షన్‌ను అందుకునే వెసులుబాటు కలుగుతుంది.
 
 బీమా రక్షణ
 కేవలం పెన్షనే కాకుండా బీమా రక్షణ ఉండటం కూడా ఈ పథకాల్లో ప్రధానమైన ఆకర్షణ. పాలసీదారునికి అనుకోని సంఘటన ఏదైనా జరిగి క్లెయిమ్ సంభవిస్తే పాలసీ మొత్తంతో పాటు అప్పటి వరకు జమ కూడిన నిధిని మొత్తం నామినీకి ఇవ్వడం జరుగుతుంది. చివరగా.. రిటైర్మెంట్ కోసం ప్రణాళికను సిద్ధం చేసుకునేటప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ కాలపరిమితి ఎక్కువ ఉండే విధంగా చూసుకోవడమే కాకుండా చిన్న వయస్సులోనే ప్రారంభించండి. దీని వలన చిన్న మొత్తంతోనే అధిక పెన్షన్ పొందొచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement