డబ్బు గుంజడానికే దావా: రజనీకాంత్
చెన్నై: తనను అప్రదిష్ట పాల్జేసేందుకే ఫైనాన్సియర్ ముకుంద్ బోత్రా దావా చేశారని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. మద్రాస్ హైకోర్టుకు తెలిపారు. తన వియ్యంకుడు (అల్లుడు తండ్రి) కస్తూరి రాజా తీసుకున్న రూ.65 లక్షల రుణానికి తాను హామీదారుగా లేనని ఆయన స్పష్టం చేశారు. తనను అపఖ్యాతి పాలుచేయడానికి, డబ్బు గుంజడానికే ముకుంద్ బోత్రా దావా వేశారని పేర్కొన్నారు. జూన్ 22న మద్రాస్ హైకోర్టు జారీ చేసిన నోటీసులకు రజనీకాంత్ బుధవారం సమాధానం ఇచ్చారు.
కస్తూరి రాజా 2012లో 'మై హూ రజనీకాంత్' అనే హిందీ సినిమా నిర్మాణం కోసం తన వద్ద రూ. 40 లక్షలు రుణం తీసుకున్నారని, ఆ తర్వాత మరో రూ. 25 లక్షలు రుణం అడిగారని.. ఆ రుణం తాను చెల్లించలేకపోతే తన కుమారుడు ధనుష్ మామ అయిన రజనీకాంత్ చెల్లిస్తారని తనకు హామీ ఇచ్చారని ఫైనాన్సియర్ ముకుంద్ బోత్రా తన పిటిషన్ లో పేర్కొన్నారు.