
వందకు పైగా గ్రామాలు అంధకారంలోనే..
సాక్షి, విశాఖపట్నం : పై-లీన్ తుపాను వెళ్లిపోయినా అది మిగిల్చిన నష్టం మాత్రం ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)ను వేధిస్తోంది. మరోవైపు విద్యుత్ పునరుద్ధరణకు నోచుకోక ఇప్పటికీ వందకు పైగా గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. వందలమంది ఉద్యోగులు విధుల్లో ఉన్నా.. ఆశించిన స్థాయిలో పునరుద్ధరణ చర్యలు సాగట్లేదని ప్రజలు ఆక్షేపిస్తున్నారు. ఇప్పటికీ కవిటి, కంచిలి, సోంపేట పరిధిలోని చాలా గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. చాలాచోట్ల స్తంభాలు విరిగి, తీగలు తెగిపడ్డాయి.
ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరిగాయి. ఇప్పటికీ 33/11 కేవీ సబ్‌స్టేషన్ల మరమ్మతు పనుల్లోనే విద్యుత్ సిబ్బంది ఉన్నారని, గ్రామాలకు విద్యుత్ సరఫరా దిశగా పూర్తిస్థాయిలో దృష్టి సారించట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ లేక కమ్యూనికేషన్ వ్యవస్థ మూగబోయింది. చాలా గ్రామాల్లో అద్దెకు జనరేటర్లను తీసుకొచ్చి, మొబైల్ ఫోన్లకు చార్జింగ్‌ను వ్యాపారంగా చేసుకున్నారు. ఒక్కో సెల్‌ఫోన్ చార్జింగ్‌కు రూ.20 వసూలు చేస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈపీడీసీఎల్ పరిధిలో రూ.78 కోట్లు నష్టం వాటిల్లినట్టు అధికారులు లెక్క తేల్చారు. 1026 విద్యుత్ స్తంభాలు, 112 సబ్ స్టేషన్లు పాడైనట్టు నిర్ధారించారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట డివిజన్ పరిధిలో ఎక్కువ నష్టం వాటిల్లినట్టు చెప్తున్నారు. ఈపీడీసీఎల్ సీఎండీ ఎం.వి. శేషగిరిబాబు సహా 1450 మంది ఉద్యోగులతో 128 బృందాలు విద్యుత్ పునరుద్ధరణ చర్యల్లో ఉన్నాయి.
శుక్ర, శనివారాల్లోగా మరమ్మతులన్నీ పూర్తిచేసి, విద్యుత్ సరఫరా పునరుద్ధరించనున్నట్టు అధికారులు చెప్తున్నారు. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్టు తెలుస్తోంది.