ఒలింపిక్స్‌లో భారతే చెత్త దేశం!
120 కోట్ల జనాభా. ప్రపంచ అగ్రదేశాలకు దీటుగా జీడీపీ. అయినా విశ్వక్రీడల వేదిక ఒలింపిక్స్‌లో భారత్‌కు దక్కిన పతకాలు రెండే. ఈ రెండు పతకాలైనా దక్కినందుకు దేశంలో సంబురాలు. మరీ ఒలింపిక్స్‌లో మన ప్రదర్శన గురించి బయటి ప్రపంచం ఏమనుకుంటోందంటే.. చాలానే నోరు పారేసుకుంటోంది. 'రియో ఒలింపిక్స్‌లో భారత్‌దే అత్యంత చెత్త ప్రదర్శన' అని ఓ న్యూజిల్యాండ్ దినపత్రిక నోరు పారేసుకుంటే.. ప్రముఖ బ్రిటిష్ జర్నలిస్టు పీయర్స్ మోర్గాన్ మరింత చెత్త వ్యాఖ్యలు చేసి.. ట్విట్టర్‌లో దుమారం రేపాడు.
'120 కోట్ల జనాభా కలిగిన దేశం కేవలం రెండంటే రెండు పతకాలు తెచ్చుకున్నందుకు సంబురాలు జరుపుకొంటోంది. ఎంత చికాకు కలిగించే విషయమిది' అంటూ మోర్గాన్ చేసిన ట్వీట్‌పై భారతీయ నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇతర దేశాలపై నోరు పారేసుకునేముందు నీ సొంత పనేంటో చూసుకోమని ఘాటుగా బదులిచ్చారు. ఎవరైనా, ఏదైనా గెలిచినప్పుడు సంబురాలు చేసుకోవడం మీ సంస్కృతిలో చికాకు కలిగించే విషయం కావొచ్చుకానీ, మా దేశ సంస్కృతిలో కాదంటూ గట్టిగా మందలించారు.
మరోవైపు 'ఒలింపిక్స్ ఇండియా వరెస్ట్ కంట్రీ' అనే శీర్షికతో న్యూజిలాండ్ హెరాల్డ్ పత్రిక ఓ కథనాన్ని వండివార్చింది. భారత్ రెండు మెడల్స్ సాధించి పతకాల పట్టికలో 67వ స్థానంలో నిలిచిందని, జనాభా, జీడీపీ ప్రకారం చూసుకుంటే.. ఒలింపిక్స్‌లో పాల్గొన్న అన్ని దేశాల కంటే ఇదే చెత్త ప్రదర్శన అని పేర్కొంది. ఇక ఒక్క పతకం కూడా గెలువకుండా ఇంటిముఖం పట్టిన మన దాయాది పాకిస్థాన్‌ను అసలు లెక్కలోకే రాదంటూ ఈ పత్రిక ఏకిపారేసింది.