‘మోదీ వ్యక్తిగత అవినీతిపై పక్కా సమాచారం’
- అందుకే నన్ను చూసి భయకంపితులవుతున్నారు
- సభలో మాట్లాడనివ్వడం లేదు.. రాహుల్ తీవ్ర ఆరోపణలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీకి సంబంధించిన వ్యక్తిగత సమాచారం తన వద్ద ఉందని, ఆ సమాచారాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టనివ్వకుండా తనను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడ్డారని, ఆ సమాచారం తనవద్ద ఉండటంతో ఆయన భయకంపితులవుతున్నారని అన్నారు. మోదీ అవినీతిని బయటపెట్టనివ్వకుండా తనను అడ్డుకుంటున్నారని తీవ్ర ఆగ్రహంగా పేర్కొన్నారు. నోట్ల రద్దుతో ఆయన లక్షలాది మంది ప్రజల ఉపాధిని ధ్వంసం చేశారని, ఇందుకుగాను ప్రధాని మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రతిపక్షాల ఆందోళనలతో లోక్‌సభ సమావేశాలు గురువారానికి వాయిదా పడిన నేపథ్యంలో రాహుల్‌గాంధీ ప్రతిపక్ష పార్టీల ఎంపీలతో కలిసి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ అవినీతికి సంబంధించిన తనవద్ద పక్కా సమాచారం, పూర్తి సమాచారం ఉందని రాహుల్ అన్నారు. ఆ సమాచారాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టనివ్వకుండా అడ్డుకుంటున్నారని, తాను పార్లమెంటు సభ్యుడినని, తనకు సభలో మాట్లాడే హక్కు ఉందని అన్నారు.
సభ నిర్వహణ విషయంలో ప్రధాని అబద్ధాలు మాట్లాడుతున్నారని, నోట్లరద్దుపై బేషరతుగా పార్లమెంటులో చర్చకు తాము సిద్ధంగా ఉన్నా.. అధికారపక్ష సభ్యులే లేచినిలబడి సభను అడ్డుకుంటున్నారని, దేశ పార్లమెంటు చరిత్రలోనే అధికార పక్షం సభను అడ్డుకోవడం ఇదే తొలిసారి అని రాహుల్ ఆరోపించారు. ఈ విషయంలో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వలేదు. ప్రతిపక్ష నేతలు మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాల నిర్వహణ విషయంలో ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.