జగన్‌కు సంఘీభావం తెలిపేందుకు స్థలం
చంచల్‌గూడ వద్ద ఏర్పాటుకు దక్షిణ మండల డీసీపీ హామీ
జైలు వద్ద పోలీసుల వైఖరిపై కమిషనర్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
సానుకూలంగా స్పందించిన అనురాగ్ శర్మ
సాక్షి, హైదరాబాద్: నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు వీలుగా చంచల్‌గూడ జైలు వద్ద ప్రత్యేక స్థలం ఏర్పాటు చే స్తామని పోలీసు అధికారులు హామీ ఇచ్చారు. జగన్‌కు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న అభిమానులు, మహిళల పట్ల పోలీసులు వైఖరి మార్చుకోవాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మకు వినతిపత్రం అందజేశారు.
పార్టీ నేతలు గట్టు రామచంద్రరావు, జనక్‌ప్రసాద్, రెహమాన్‌లతో కూడిన బృందం బషీర్‌బాగ్ కార్యాలయంలో ఆయన తో భేటీ అయ్యింది. జగన్‌కు సంఘీభావంగా అనేకమంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు జైలు వద్దకు వస్తోంటే పోలీసులు వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిపింది. ఇతర పార్టీల వారికి మాదిరిగా వైఎస్‌ఆర్ సీపీకి అవకాశం ఇవ్వకుండా అమానుషంగా లాఠీచార్జి చేయడం, అరెస్టు చేసి పోలీసుస్టేషన్లలో పెట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని పార్టీ నేతలు వివరించారు.
దీనిపై స్పందించిన కమిషనర్ సౌత్‌జోన్ డీసీపీతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పార్టీ నేతలు కమిషనరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏ పార్టీకీ వ్యతిరేకంగా దీక్ష చేయడం లేదు. తెలుగు ప్రజలందరి కోసం, సమన్యాయం పాటించాలని దీక్ష చేస్తున్నారు. ఆయనకు సంఘీభావం తెలపకూడదని పోలీసులు భావించడం దారుణం..’ అని అన్నారు. అనంతరం కమిషనర్ సూచనల మేరకు పార్టీ నేత రెహమాన్ సౌత్‌జోన్ డీసీపీ తరుణ్‌జోషీని పాతబస్తీలోని ఆయన కార్యాలయంలో కలిశారు. గురువారం తాను స్వయంగా జైలు వద్దకు వచ్చి సంఘీభావ కార్యక్రమాల కోసం ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేస్తానని డీసీపీ ఆయనకు హామీ ఇచ్చారు. ప్రతిరోజూ అరగంట పాటు ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరిస్తామని చెప్పారు. అయితే ఈ సమయాన్ని పెంచాలని రెహమాన్ డీసీపీని కోరారు.