
యానాం జైల్లో దుండగులు పడ్డారు
యానాం టౌన్/తాళ్లరేవు/రామచంద్రపురం, న్యూస్‌లైన్ : యానాం సబ్‌జైలులో చొరబడిన దుండగులను పోలీసులు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. సబ్‌జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ముగ్గుర్ని మట్టుబెట్టే లక్ష్యంతో పుదుచ్చేరికి చెందిన 14మంది గురువారం సబ్‌జైల్లో చొరబడడం తీవ్ర సంచలనం కలిగించింది. చొరబాటుకు పాల్పడిన 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరొకడు పరారీలో ఉన్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. వివరాలు... గురువారం తెల్లవారుజాము 4 గంట ల సమయంలో పుదుచ్చేరికి చెందిన దుండగులు యానాం సబ్‌జైలులోకి చొరబడ్డారు. సబ్ జైలు వెనుక 15 అడుగుల ఎత్తున గల ప్రహరీ మీదుగా నిచ్చెన, తాళ్ల సహాయంతో వారు జైలులో చొరబడ్డారు. ఒక సెంట్రీ నోటికి ప్లాస్టర్ వేసి, తాళ్లతో కట్టి బంధించారు.
యానాం సబ్‌జైలులో జీవిత ఖైదీలుగా ఉన్న కరడు గట్టిన నేరస్తులు మణికంఠన్, కర్ణ, సెన్‌బాగీ శ్రీ కుమరన్‌ల హత్య లక్ష్యంగా దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇది చూసిన ఒక సెంట్రీ పోలీసులకు సమాచారం ఇవ్వడం తో ఈ ప్రయత్నం బెడిసికొట్టింది. స్థానిక పోలీసులు హుటాహుటిన సబ్‌జైలు వద్దకు చేరుకోగా దుండగులు పరారయ్యారు. వీరి వెంటపడిన పోలీసులు గంటల వ్యవధిలోనే యానాం పరిసర ప్రాంతాలలో 13మందిని అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరిని ప్రశ్నిస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ పురుషోత్తమన్ సిఐ కబిలగురు పరిశీలించారు.
మణికంఠన్, కర్ణ, సెన్‌బాగీ శ్రీకుమరన్‌లు తమిళనాడు, పుదుచ్చేరిలలో అనేక హత్యలు, చోరీలకు పాల్పడి జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. వీరిని యానాం సబ్‌జైలుకు ఏడాది కిందట తరలించారు. కాగా పుదుచ్చేరిలో 8 నెలల క్రితం జగన్ అనే నేరగాడిని పుదుచ్చేరి కోర్టునుంచి కారైకల్‌కు పోలీసులు తరలిస్తుండగా కొందరు జీపుపై బాంబులతో దాడి చేసి కత్తులతో నరికి హత్య చేశారు. యానాం సబ్‌జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న పై ఖైదీలు ఇందుకు పథక రచన చేసినట్టు ఆ తర్వాత నిందితులు పేర్కొనడం అప్పట్లో సంచలనం కలిగిం చింది. దీనిపై విచారణ నిర్వహించగా సబ్‌జైలు సిబ్బంది సిమ్ కార్డులు, సెల్‌ఫోన్ బ్యాటరీలు ఇచ్చి ఈ పథక రచనకు సహకరించినట్టు వెల్లడైంది. అసిస్టెంట్ జైలు సూపరింటెం డెంట్‌కు మెమో ఇచ్చి, ఐదుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు కూడా. ఆ ఖైదీలను మట్టుబెట్టేందుకు కుట్ర పన్ని ఈ దుండగులు వచ్చి ఉండవచ్చని, వీరు హతుడు జగన్ వర్గీయులు కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కత్తులు, కారం పొడి ప్యాకెట్లు, బైండింగ్ వైరు దొరకడంతో హత్యాపథకం వెల్లడైంది.
సబ్‌జైలులో దుండగుల దాడి సమాచారం తెలియడంతోనే పోలీసులు అప్రమత్తమై సబ్‌జైలుకు చేరుకున్నారు. అప్పటికే దుండగులు గోడదూకి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు వెంబడించారు. తొలుత ఏడుగురిని పట్టుకున్నారు. మిగిలినవారు యానాం సమీపంలోని ఆంధ్రా ప్రాంతాలైన లచ్చిపాలెం, ఉప్పంగల, సుంకరపాలెం తదితర గ్రామాలలోకి పరుగులు తీశారు. వీరి కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలించారు. నలుగురిని, ఇద్దరిని రెండు దఫాలుగా అరెస్టు చేశారు. ఒక దుండగుడు మాత్రం వీరి కన్నుగప్పి పరారీలో ఉన్నాడు.
పట్టించిన మారధాన్..!
పోలీసులు తక్షణం అప్రమత్తం అవడానికి గురువారం నిర్వహించిన మారథాన్ పరుగుపందెం దోహదం చేసింది. సుమారు 400 మందితో ఈ మారథాన్ తలపెట్టారు. యానాంలోని వివిధ విభాగాల పోలీసులంతా ఉదయం 5 గంటలకు బాలయోగి క్రీడా ప్రాంగణానికి చేరుకున్నారు. సబ్‌జైల్ కానిస్టేబుల్ ఇంకా రన్ ప్రారంభం కాకపోవడంతో తిరిగి సబ్‌జైలుకు వెళ్లాడు. అప్పుడే చొరబాటు, దాడి అంశాన్ని గుర్తించి సమాచారం ఇచ్చాడని తెలిసింది. దీంతో పోలీసులంతా ఒక్కసారిగా సబ్‌జైలును చుట్టుముట్టారు.
సబ్‌జైల్ భద్రత డొల్ల
సబ్‌జైల్‌లో చొరబాటుతో భద్రతలోని డొల్లతనం బయటపడింది. గతంలో పలుమార్లు ఈ సబ్‌జైలులో సెల్‌ఫోన్ బ్యాటరీలు, సిమ్‌కార్డులు దొరికాయి. గతంలో ఒక రౌడీషీటర్ వీటితో కూడిన బాక్సును జైలులో వేశానని చెప్పి కోర్టులో లొంగిపోయాడు కూడా. కనీసం జైలులో సీసీ కెమెరాలు కూడా లేకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. ఒక తాడు సాయంతో జైలు గోడలు దాటి లోపలికి వెళ్లగలిగారంటే భద్రత ఎంత నాసిగా ఉందో అర్థమవుతుంది. కాగా సబ్‌జైల్‌పై దాడికి సంబంధించి 13 మందిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పీ పురుషోత్తమన్ ధ్రువీకరించారు. గురువారం పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సబ్‌జైల్‌పై 14 మంది దాడికి పాల్పడ్డారన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి పుదుచ్చేరి తరలించనున్నట్టు తెలిపారు.
రామచంద్రపురంలో కలకలం
యానాం సబ్ జైల్‌లో దుండగుల చొరబాటు ఘటన రామచంద్రపురంలో కలకలం రేపింది. స్థానిక లాడ్జిలో ఈ దుండగులు యాత్రికుల ముసుగులో మకాం వేశారని పోలీసు దర్యాప్తులో తేలింది. ఈ ఘటనలో పాల్గొన్న తొమ్మిది మంది స్థానిక జయా రెసిడెన్సీ లాడ్జిలో బుధవారం మధ్యాహ్నం 1-15 గంటలకు దిగారు. ఒకరు తెలుగు మాట్లాడుతుండగా మిగిలిన 8 మంది తమిళంలో మాట్లాడుకున్నారని లాడ్జి సిబ్బంది చెప్పారు.
బుధవారం రాత్రి 11.30కి వారు అన్నవరం గుడికి వెళుతున్నామని చెప్పి బొలేరో వాహనంలో వెళ్లారని తెలిపారు. ఈ తొమ్మిది మంది లాడ్జిలో 5,7,8 రూములు తీసుకున్నారు. లాడ్జి రికార్డుల్లో ఆనందం, సన్‌ఆఫ్ ఆర్ముగం, పాండిచ్చేరి అని రాశారు. సెల్ నంబర్ తప్పు రాగా మరో నంబర్ అడిగితే 8680977129 అని రాశారని సిబ్బంది తెలిపారు. కాగా యానాం పోలీసులు జైలు ఘటనలో పట్టుబడిన ఇద్దరిని తీసుకుని గురువారం జయా రెసిడెన్సీకి వచ్చారు. వారు మకాం చేసిన గదులు తెరిచి మూడు బ్యాగులను స్వాధీనపర్చుకున్నారు. సిబ్బందిని వివరాలడిగారు. నిందితుల వాహనం ద్రాక్షారామలో ఉండగా స్వాధీనం చేసుకున్నట్టు యానాం పోలీసులు తెలిపారు.