ఫార్మాసిస్టునంటూ హాస్యమాడిన పోప్
వాటికన్ సిటీ: తానో ఫార్మాసిస్టునంటూ పోప్ ఫ్రాన్సిస్ హాస్యమాడారు. ప్రార్థనను గుండెకు మంచి మందుగా పేర్కొన్నారు. ఆదివారం సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద గుమిగూడిన విశ్వాసులనుద్దేశించి ఆయన మాట్లాడారు. మందు గుళికల ప్యాకెట్‌ను తలపించేలా రూపొందించిన ఓ బాక్సులోని రోజరీ (రోమన్ కేథలిక్కులు తమ ప్రార్థనలను లెక్కించేందుకు ఉపయోగించే హారం)ని పట్టుకుని తన భవనం కిటికీలో ఆయన దర్శనమిచ్చారు. మానవ హృదయాకారంలో దానిని తయారు చేశారు. రోజరీ ప్రార్థనను ఆధ్యాత్మిక ఔషధంగా పేర్కొంటూ అది గుండెకు మంచిదని సిఫారసు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం వేలాదిమంది విశ్వాసులకు వాలంటీర్లు ఈ బాక్సులు పంపిణీ చేశారు.