బెర్లిన్ : పెళ్లయిన పురుషులను కూడా చర్చిలలో మత గురువులుగా నియమించే ప్రతిపాదనపై ఆలోచిస్తున్నట్లు పోప్ ఫ్రాన్సిస్ గురువారం చెప్పారు. మతాచార్యుల కొరత వేధిస్తున్నందున గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో పనిచేయడానికి సిద్ధపడే పెళ్లయిన పురుషులకు అవకాశం లభించవచ్చని ఆయన ఒక జర్మనీ వార పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
అనేకచోట్ల మతాచార్యుల కొరత ఉన్నందున, వారి నియామకానికి కొత్త పద్ధతులు అవలంబించాలని చర్చిల్లో చాలా మంది భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. బ్రహ్మచర్యం పాటించేవారితోపాటు చర్చిల్లో పనిచేయడానికి కృతనిశ్చయంతో ఉండే వయసు మళ్లిన, పెళ్లయిన పురుషులకు కూడా అవకాశం ఇవ్వాలని చర్చిల్లోని వారు అనుకుంటున్నారని పోప్ పేర్కొన్నారు.