
'పేదరికమే నా ఫస్ట్ ఇన్ స్పిరేషన్'
న్యూఢిల్లీ: తన జీవితంలో పేదరికమే మొదట స్ఫూర్తిగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పేదల కోసం పనిచేయాలన్న తపన రగిలించిందని 'టైమ్స్' మేగజీన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే....
' నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. రైలు బోగీల్లో ఛాయ్ అమ్మేవాణ్ని. మమల్ని పోషించడం కోసం మా అమ్మ పాచిపని చేసేది. పేదరికాన్ని చాలా దగ్గరగా చూశా. నా బాల్యమంతా పేదరికంలోనే గడిచింది. అలా చూసుకుంటే పేదరికమే నా ఫస్ట్ ఇన్ స్పిరేషన్'. ఈ స్ఫూర్తితోనే పేదలకు ఏదైనా చేయాలన్న సంకల్పం చెప్పుకున్నా. నాకోసం బతకకూడదని.. ఇతరుల కోసం బతకాలని.. వారి కోసం పనిచేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా.
12 లేదా13 ఏళ్ల వయసులో స్వామి వివేకానంద పుస్తకాలు చదవడం మొదలు పెట్టా. ఈ పుస్తక పఠనంతో నా ఆలోచనా దృక్ఫథం మారింది. ఇతరుల కోసం జీవితాన్ని అంకితం చేయాలని15 లేదా 16 ఏళ్ల వయసులో నిర్ణయించుకున్నా. ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తున్నా' అని మోదీ వెల్లడించారు.