శిథిలాల్లో చిన్నారులు.. మిన్నంటిన ఆర్తనాదాలు!
అది తెల్లవారుజాము 3.30 గంటల సమయం. అందరూ గాఢమైన నిద్రలో ఉన్నారు. ఇంతలో భూమి ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. భారీ భూకంపం. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత. నిద్రలో ఉన్నవారు నిద్రలోనే కన్నుమూశారు. ఇళ్లూ, భవనాలు నేలమట్టమయ్యాయి. గ్రామాలకు గ్రామాలు శిథిలాల గుట్టలుగా మారిపోయాయి. దాదాపు 73 మంది ప్రాణాలు విడిచారు. 150 మంది గల్లంతయ్యారు. శిథిలాల కింద వందలమంది చిక్కుకున్నారు. శిథిలాల కింద ఉన్నవారిని కాపాడటానికి సహాయ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నది. శిథిలాల కింద నుంచి చిన్నారుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని, చాలాచోట్ల గాయాలైన స్థానికులు శిథిలాలలోని తమ చిన్నారులను కాపాడుకోవడానికి వట్టి చేతులతో మట్టిపెళ్లలను తొలగిస్తున్నారని సహాయక సిబ్బంది తెలిపారు. భూకంప కేంద్రం సమీపంలోని చాలా గ్రామాల్లో, పట్టణాల్లో హృదయావిదారకమైన పరిస్థితులు నెలకొన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.
ఇది బుధవారం తెల్లవారుజామున ఇటలీలో సంభవించిన భారీ భూకంపం సృష్టించిన పెనువిలయం. సెంట్రల్ ఇటలీ అంబ్రియాలోని నొర్షియా సమీపంలో సంభవించిన ఈ భూకంపం ధాటికి ఇటలీ రాజధాని రోమ్‌లోనూ భవనాలు వణికిపోయాయి. భూకంప కేంద్ర స్థానానికి 100 మైళ్ల దూరంలోని క్రొషియాలోనూ ప్రభావం కనిపించింది. అంబ్రియన్ పరత్వాల సమీపంలో ఉన్న అమెట్రిస్, అక్యుమోలి, అర్కాట డెల్ ట్రోంటో, పెస్కారా డెల్ టోరంటో తదితర గ్రామాలు, పట్టణాలు పూర్తిగా నేలమట్టమై.. శిథిలాల దిబ్బగా కనిపిస్తున్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర విషాద పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, ఈ భూకంపంలో భారతీయ బాధితులెవరూ లేరని, ఇటలీలోని ప్రవాస భారతీయులందరూ క్షేమంగా ఉన్నట్టు సమాచారం అందుతోందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్‌లో తెలిపారు.