‘అసలైన యుద్ధానికి’ రెడీగా ఉండు..!
ట్రంప్‌కు రష్యా, ఇరాన్ వార్నింగ్!
సిరియాలో అధ్యక్షుడు అసద్ సేనలు లక్ష్యంగా అమెరికా వైమానిక దాడులు చేయడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. అసద్‌కు కొమ్ముకాస్తున్న రష్యా, ఇరాన్ తాజాగా అమెరికా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. సిరియా ప్రభుత్వ సేనలు లక్ష్యంగా అమెరికా మరిన్ని దాడులు చేస్తే.. తాము సైనిక దాడులతో బదులు ఇవ్వాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించాయి. అసద్ సేనలపై క్షిపణీ దాడులు నిర్వహించడం ద్వారా ట్రంప్ లక్ష్మణ రేఖ (రెడ్‌లైన్)ను దాటారని పేర్కొన్నాయి. ‘ఇప్పటినుంచి భద్రతా పరమైన లక్ష్మణరేఖను ఉల్లంఘిస్తే మేం దీటుగా సమాధానమిస్తాం. మేం ఎలా బదులివ్వగలమో అమెరికాకు బాగా తెలుసు’ అని రష్యా, ఇరాన్ ఆర్మీ చీఫ్‌లు ఒక ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు లండన్‌లో రష్యా రాయబార కార్యాలయం ట్విట్టర్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సిరియా విషయంలో రష్యాకు అల్టిమేటం ఇస్తే ఇక అసలైన యుద్ధం తప్పదని హెచ్చరించింది.
ఇటీవల సిరియాలోని రెబెల్స్ అధీనంలో ఉన్న ప్రాంతంలో రసాయనిక దాడి జరగడం.. ఈ దాడి అసద్ ప్రభుత్వం పనేనని ఆరోపణలు రావడంతో సిరియా విషయంలో అమెరికా తన వైఖరి మార్చుకుంది. గత మంగళవారం సిరియా వైమానిక స్థావరంపై క్షిపణి దాడులు నిర్వహించింది. అంతేకాకుండా సిరియా అధ్యక్షుడిగా బషర్ అల్ అసద్‌ను గద్దె దించడమే తమ ప్రధాన ప్రాధాన్యమని ఐరాస అమెరికా రాయబారి నిక్కీ హెలీ తాజాగా స్పష్టం చేశారు. అయితే, అసద్‌కు గట్టిగా మద్దతు ఇస్తున్న రష్యా, ఇరాన్.. ట్రంప్ సర్కారును బాహాటంగా సవాల్ చేస్తున్నాయి.