స్వామినాథన్ సిఫారసుల అమలుకు సిద్ధం
సాక్షి, హైదరాబాద్ : దేశంలో రైతులకు మేలు కలిగేలా స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. రైతులకు నీరు, కరెంటు సమృద్ధిగా అందితే ఆత్మహత్యలు ఉండవన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. తెలంగాణతో పాటు దేశంలో రైతుల ఆత్మహత్యలు దురదృష్టకరమన్నారు. ఢిల్లీకి చెందిన కన్స్యూమర్ కో ఆర్డినేషనల్ కౌన్సిల్ (సీసీసీ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రెండు రోజుల పాటు నిర్వహించే జాతీయ వినియోగదారుల సదస్సును శనివారమిక్కడి రవీంద్రభారతిలో ప్రారంభించారు.
రైతులను వినియోగదారులుగా పేర్కొంటూ రైతు సమస్యలనే ప్రధాన ఎజెండాగా చేపట్టిన ఈ సదస్సులో దత్తాత్రేయ మాట్లాడుతూ, అన్నదాత సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయాలు మాత్రమే తీసుకొంటుందని, నిధులు, అధికారాలను రాష్ట్రాలకే అప్పగిస్తుందన్నారు. 24 గంటల పాటు దేశంలోని రైతులకు కరెంటు ఇచ్చేందుకు, సమగ్ర బీమా పథకాన్ని రూపొందించేందుకు కేంద్రం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, దేశంలో రైతులు, వినియోగదారులు లాభపడటం లేదని, కేవలం దళారీలే బాగుపడుతున్నారన్నారు.
1995 నుంచి ఇప్పటి వరకు దేశంలో 2,70,924 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఇప్పటికీ దేశంలో అరగంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు. రైతు పండించిన పంటను తక్కువధరకు కొనుగోలు చేసి దళారీలు రెట్టింపు ధరకు అమ్ముతున్నారన్నారు. రైతులకు వ్యక్తిగత పంటల బీమా, గిట్టుబాటు ధర లభిస్తే ఆత్మహత్యలు ఉండవన్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత మాట్లాడుతూ, రైతులను వినియోగదారులుగా గానీ, ఉత్పత్తిదారులుగా గానీ గుర్తించడం లేదన్నారు.
రైతుల ఆత్మహత్యలు బాధాకరమని, విత్తనాలు సరఫరా చేసే కంపెనీలే రైతులకు బీమా ఇప్పించేలా చట్ట సవరణ చేయాలని సూచించారు. వినియోగహక్కులు రైతులకు అందాలన్నారు. సమావేశంలో సీసీసీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ అదిల్ జైనుల్‌భాయి, కన్స్యూమర్స్ ఇంటర్నేషనల్, మలేషియా హెడ్ ఇంద్రాని తురిసింగం, జస్టిస్ నౌషద్ అలీ తదితరులు పాల్గొన్నారు.