రైతులకు కష్టమే..
► ముసలి పశువులను ఏం చేయాలి?
► వ్యవసాయం కుంటుపడుతుంది: రైతు సంఘాలు
సాక్షి, హైదరాబాద్: పశువుల క్రయవిక్రయాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనలపై వివిధ వర్గాల్లో భిన్నాభి ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం నిర్ణయాన్ని కొందరు రైతులు స్వాగతిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. పశువుల క్రయ విక్రయాలు రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పాటించాలన్న నియమేమీలేదని పశు సంవర్ధక శాఖ అధికా రులు స్పష్టం చేస్తున్నారు. కేంద్రం తెచ్చిన నిబంధనలు రాష్ట్రంపై ప్రభావం ఉండబోదని వారు చెబుతున్నారు. అయితే, కొత్త నిబంధ నల ప్రకారం రైతు పశువును అమ్మాలంటే అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉటుం దని పలువురు పేర్కొంటున్నారు. వయసు మళ్లిన, అనారోగ్యానికి గురైన పశువుల విష యంలో రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది.
ముసలి పశువులను ఏం చేసేది?
రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే 275 పశు మార్కెట్లు ఉన్నాయి. మరో 175 మార్కె ట్లు ప్రైవేటు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇవిగాక వెయ్యి వరకు సంతలున్నాయి. 2012 లెక్కల ప్రకారం తెలంగాణలో 92 లక్షల ఆవులు, గేదెలు, ఎద్దులు ఉన్నాయి. వాటిలో దాదాపు 25 లక్షల ఆవులు, 25 లక్షల ఎద్దు లుంటాయి. 85.86 లక్షల మంది ఉన్న సన్న, చిన్నకారు రైతులు ఎడ్లు, ఆవులపై ఆధా రపడి వ్యవసాయం చేస్తుంటారు.
కేంద్రం తెచ్చిన నిబంధనలు అమలైతే రాష్ట్రంలో దాని ప్రభావం వ్యవసాయంపై పడుతుందని రైతు లు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. రైతు తన వద్ద ఉన్న ముసలి ఎద్దు / దున్న/ఆవును విక్రయించాల్సి వస్తే... వ్యవ సాయం కోసమేని ఎలా ధ్రువీకరణ ఇవ్వ గల డు? వ్యవసాయానికి పనికిరాని దాన్ని అమ్మేసి మరో పశువును కొనుగోలు చేస్తాడు. కానీ ఇప్పుడది సాధ్యపడదు.
గుర్తింపు కార్డులు ఎలా?
కొత్త నిబంధనల ప్రకారం పశువు కొనాలన్నా.. అమ్మాలన్నా రైతుకు గుర్తింపు కార్డులు తప్ప నిసరి. అలాగే భూమి ఉన్నట్లు ధ్రువీకరణ పత్రాలు చూపాలి. కానీ కౌలు రైతులకు ఈ పత్రాలుండవు. కౌలు రైతులే ఎక్కువగా ఎడ్లను వినియోగిస్తారు. వీరికి గుర్తింపు పత్రాలు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తనున్నాయి.