కేంద్ర ప్రభుత్వానికి రూ.25వేల జరిమానా
న్యూఢిల్లీ : రైతుల ఆత్మహత్యలను కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన సమస్యగా పరిగణించటం లేదని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అఫిడవిట్ దాఖలు చేయకపోవడంపై ఉన్నత ధర్మాసనం శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి కోర్టు రూ.25వేల జరిమానా విధించింది. నాలుగు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. కాగా రైతు ఆత్మహత్యలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. రైతుల ఆత్మహత్యలను పూర్తిగా నివారించాల్సిదేనని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
రైతుల ఆత్మహత్యల నివారణకు రూపొందించుకున్న విధానాన్ని మరోసారి పునఃపరిశీలించాలని కోర్టు సూచించింది. ఎనిమిది ఏళ్ల క్రితం నాటి పాలసీని మరోసారి పునఃసమీక్షించాలని సూచించింది. అంతేకాకుండా రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయన్న కేంద్రం వాదనతో సుప్రీం సంతృప్తి చెందలేదు. అసలు రైతుల ఆత్మహత్య ఘటనలు ఎక్కడా కనిపించకూడదని ఆదేశించింది. దీనిపై ఆరువారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయకపోవటంతో కోర్టు సీరియస్ అయింది.