‘అనర్హత’పై రాజ్యాంగాస్త్రం!
ఎంపీలు, ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం తీర్పు వర్తించకుండా ప్రభుత్వం కసరత్తు
న్యూఢిల్లీ: చట్టసభల సభ్యులు కేసుల్లో దోషులుగా తేలిన క్షణం నుంచే పదవులకు అనర్హులవుతారని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వర్తించకుండా ఉండేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీని కోసం రాజ్యాంగాన్ని సవరించాలని యోచిస్తోంది. తీర్పును వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలను కలుపుకువెళ్లడానికి ప్రయత్నిస్తోంది. తీర్పును సమీక్షించాలని త్వరలో సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ కూడా వేసే అవకాశముందని న్యాయ మంత్రిత్వ శాఖ వర్గాలు చెప్పాయి. సుప్రీం తీర్పును అమలు చేయాలని ఎన్నికల సంఘం ఇటీవల రాష్ట్రాలను ఆదేశించడం, దోషులుగా తేలే ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల వివరాలను ప్రతి నెలా తమకు అందజేయాలని ఆదేశించడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ తీర్పు వర్తించకుండా ఉండేందుకు చట్టబద్ధ మార్గాల్లో చర్యలు ప్రారంభించింది. రాజకీయ పార్టీల మద్దతు లభిస్తే ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లుతో ముం దుకెళ్తుందని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. సుప్రీం ఆదేశాన్ని పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం రాజ్యాంగ సవరణ మార్గాన్ని ఎంచుకున్నట్లు పేర్కొన్నాయి. సర్వోన్నత న్యాయస్థానం సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అనర్హత పై ఇచ్చిన తీర్పులోని రాజ్యాంగ అంశాలపై సవరణ బిల్లును తెస్తారని, పార్టీల అంగీకారం ఆధారంగానే తుది నిర్ణయం ఉంటుందని తెలిపాయి.
సుప్రీం తీర్పుపై పార్టీలతో చర్చలు జరుపుతున్నామని, ఏకాభిప్రా యం ఆధారంగానే నిర్ణయం తీసుకుంటామని న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్ ఇటీవల చెప్పారు. రివ్యూ పిటిషన్ వేస్తామని, చట్టబద్ధ మార్గంలో పరిష్కరం కోసం ప్రస్తుత చట్టాలను సవరించే అవకాశం కూడా ఉందన్నారు. కాగా, పై కోర్టుల్లో అప్పీలు పెండింగ్‌లో ఉందన్న కారణంతో చట్టసభల సభ్యుల అనర్హత వాయిదాకు వీలు కల్పిస్తున్న ప్రజా ప్రాతి నిధ్య చట్టం 8వ సెక్షన్‌లోని 4వ సబ్-సెక్షన్ రాజ్యాం గ విరుద్ధంగా ఉందంటూ సుప్రీం కొట్టేయడం తెలిసిందే. దోషులుగా తేలిన వెంటనే అనర్హతను అమలు చేయాలన్న రాజ్యాంగంలోని 101(3)(ఏ), 190(3)(ఏ) అధికరణలకు పార్లమెంటు చేర్చిన ఈ సబ్ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది.