టమాటా వెంకట్ రెడ్డి వీర సాగు గాధ | former venkat reddy special story for central governament Honor | Sakshi
Sakshi News home page

టమాటా వెంకట్ రెడ్డి వీర సాగు గాధ

Published Sat, Feb 27 2016 2:08 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

టమాటా వెంకట్ రెడ్డి వీర సాగు గాధ - Sakshi

టమాటా వెంకట్ రెడ్డి వీర సాగు గాధ

కూలీ నుంచి రైతుగా ఎదిగి.. ఆరు బోర్లు విఫలం...  
అయినా ఆగని భగీరథ ప్రయత్నం
నాలుగు ఎకరాల నుంచి... పది ఎకరాల యజమానిగా...
వృద్ధ దంపతులకు కేంద్రం ప్రభుత్వం సన్మానం
సంతోషం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు

 పొద్దుతిరుగుడు తోటలో.. ఆ పూలతో పాటుగా వినయంగా తలవంచి నిల్చున్న ఆయన పేరు కొమ్మిడి వెంకటరెడ్డి. కానీ టమాటా వెంకటరెడ్డి అంటేనే అందరూ ఠక్కున గుర్తుపడతారు. ఆ పూల మాదిరిగానే ఆయనా కాలానుగుణంగా వ్యవహరిస్తారు. వయసు మీద పడ్డా కాలంతో పాటు పరుగెత్తడం.. ఒక్కోసారి ఎదురీదడం ఆయనకు కొత్త కాదు. ఒకానొకప్పుడు ఆయనుండే రాఘవాపూర్‌లో కరువు తీవ్రతతో భూగర్భ జలాలు అడుగంటాయి. వ్యవసాయాన్నే నమ్ముకున్న వెంకటరెడ్డి కుటుంబం రోడ్డున పడే పరిస్థితుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం ఊతమై నిలిచింది. భార్య రత్నమ్మతో కలిసి 2011లో కూలీలు (జాబ్ కార్డు నెంబరు 101121)గా పనిలో చేరారు. అందరూ తమకు అప్పగించిన పనులు చేస్తుంటే వెంకటరెడ్డి మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించారు. ఉపాధి హామీ పథకం కింద ఓ బావిని మంజూరు చేయించుకుంటే తానే పది మందికి ఉపాధి కల్పించవచ్చని తలిచారు.

అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అనేక ప్రయత్నాల తరువాత.. 16 గజాల లోతున బావి తవ్వుకునేందుకు అనుమతి లభించింది. వెంటనే వెంకటరెడ్డి పనులు ప్రారంభించారు. కొద్ది లోతుకు వెళ్లగానే నీళ్లు పడ్డాయి. ఆ నీటితో దంపతులిద్దరూ పండించిన పంటలు సిరులను కురిపించాయి. ప్రస్తుతం 26 గజాల లోతు గల ఆ బావి నుంచి ఎంత తోడినా నీళ్లు తగ్గడం లేదు. కృషితో ఆయన నాలుగెకరాల నుంచి పదెకరాల రైతయ్యారు. ఈ దంపతుల భగీరథ ప్రయత్నాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఢిల్లీకి పిలిచి ఘనంగా సత్కరించింది.  -సిద్దిపేట రూరల్

 సిద్దిపేట రూరల్: జాతీయ ఉపాధి హామీ పథకం.. పేద కుటుంబంలో వెలుగును నింపింది. నాడు కూలీగా పని చేస్తూ... నేడు రైతుగా మారి పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. గతంలో  బీడు భూముల్లో పంట సిరుల కోసం తపించి చేసిన భగీరథయత్నం ఫలించింది. కష్టాన్నే నమ్ముకుని నాలుగెకరాల భూమిలో సిరులు పండించి ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు దంపతులు. వారే సిద్దిపేట మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన కొమ్మిడి వెంకట్‌రెడ్డి రత్నమ్మల  జంట. ఇటీవల కేంద్రప్రభుత్వం ఆ దంపతుల భగీరథ ప్రయత్నాన్ని గుర్తించి ఘనంగా సత్కరించింది. దీంతో రాఘవాపూర్ గ్రామ కీర్తిని  ఢిల్లీలో చాటినందుకు గాను గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 వ్యవసాయాన్నే నమ్ముకున్న ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితుల్లో ఉపాధి హామీ వారి ఊతమిచ్చింది. ఈ క్రమంలో కొమ్మిడి వెంకట్‌రెడ్డి, భార్య రత్నమ్మ దంపతులు 2011లో ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డు నెంబరులో కూలీలుగా పనిలో చేరారు. కొంత కాలంగా ఉపాధి హామీలో దంపతులిద్దరు కూలీగా పని చేశారు. తనకు ఉపాధి హామీలో బావిని మంజూరు చేయించుకుంటే ఏలా ఉంటుందన్న ఆలోచనతో ముందుకు సాగాడు. దీంతో ఒక బావి తవ్వించాలని అధికారులకు పలుమార్లు దరఖాస్తులు చేసుకున్నారు. అధికారులు స్పందించి జాతీయ ఉపాధి హామీ పథకం కింద బావి తవ్వేందుకు 16 గజాల వరకు బావి మంజూరు చేశారు. ఈ క్రమంలో వెంకట్‌రెడ్డి తన వ్యవసాయ పొలం వద్ద బావి తవ్వడం ప్రారంభించారు. బావి కొన్ని గజాల లోతుకు వెళ్లగానే నీళ్లు ఊటల ద్వారా పుష్కలంగా లభించాయి. 

 నాడు కూలీగా పని చేస్తూ.. ఇబ్బందులు పడ్డ రైతు వెంకట్‌రెడ్డి నేడు తన పొలం సాగు చేసుకుంటూ పదిమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. దీంతో రెక్కల కష్టాన్ని నమ్ముకుని తనకున్న నాలుగెకరాల భూమిని దశలవారీగా పదిఎకరాలుగా మార్చుకున్నాడు. ప్రస్తుతం వెంకట్‌రెడ్డికి ఉన్న పొలంలో వరి, పొద్దుతిరుగుడు సాగు చేస్తున్నారు. రైతు బుక్కెడు బువ్వ తింటూ మరో పది మందికి బువ్వ పెడుతూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. రైతు వెంకట్‌రెడ్డి ఎడ్లతోనే వ్యవసాయాన్ని చేస్తున్నారు. వృద్ధాప్య దశకు  చేరుతున్నప్పటికీ మొక్కవోని పట్టుదలతో కష్టపడ్డారు. గత వర్షాకాలంలో వ్యవసాయ సాగులో రూ. 50వేలు పెట్టుబడి పెట్టారు. పెట్టుబడి పోనూ రూ. 1.50లక్షలు ఆదాయం వచ్చింది. రబీలో (ప్రస్తుతం) ఉన్న భూమిలో పొద్దు తిరుగుడు, వరిని సాగు చేస్తున్నారు. పొద్దస్తమానం.. వెంకట్‌రెడ్డి దంపతులు బావి వద్దనే ఉంటూ, పని తీవ్రతను బట్టి అవసరమైన మేర కూలీలతో పని చేయించుకుంటూ ఉపాధి చూపుతున్నారు. దీంతో రైతు వెంకట్‌రెడ్డి పలువురికి అండగా  నిలుస్తున్నారు.

కుటుంబ నేపథ్యం...
సిద్దిపేట మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన కొమ్మిడి వెంకట్‌రెడ్డి, భార్య రత్నమ్మలకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. భార్య భర్తలు కష్టించి పని చేస్తేనే పూట గడిచే రోజులు. ఆ రోజుల్లోనే ముగ్గురు కూతుళ్ల పెళ్లి చేశారు. కొడుకును మంచి చదువులు చదివించడంతో ప్రస్తుతం ఓ ప్రభుత్వ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు.

వెంకట్‌రెడ్డి ఇంటి పేరుగా మారిన ‘టమాటా’....
వెంకట్‌రెడ్డికి ఇరవై ఏండ్ల క్రితం నాలుగెకరాల పడావుపడ్డ భూమి ఉండేది. అది కూడా రాళ్లు రప్పలతో కూడినది. పాడుబడిన పాతబావి ఉండగా అది కూడా ఎండిపోయింది. ఆ కాలంలో ఆరు బోర్లు వేస్తే నీళ్లు రాలేదు. పంట సాగు చేసుకుందామన్న గుడ్డం సరిగ్గా లేకుండే, అప్పటి పరిస్థితుల్లో  ఉన్న కొద్దిపాటి నీళ్లతో పంటలు పండించేవారు. అందులో ఎక్కువగా టమాటా సాగు చేసి, వాటిని ఎడ్ల బండి మీద ప్రతి రోజూ సిద్దిపేటకు వచ్చి అమ్మేవారు. ఇలా దాదాపు ఐదు సంవత్సరాల పాటు టమాటా సాగు చేసి కుటుంబాన్ని నెట్టుకువచ్చారు. దీంతో వెంకట్‌రెడ్డిని రాఘవాపూర్ గ్రామంతో పాటు పరిసర గ్రామాల వాళ్లు కూడా ‘టమాటా వెంకట్‌రెడ్డి’ అని పిలుస్తారు.

కష్టాన్ని నమ్ముకున్నా..
ఇరువై ఏళ్ల నుంచి కుటుంబాన్ని పోషించడం కష్టమైంది. అప్పటి నుంచి రెక్కల కష్టాన్ని నమ్ముకున్నా. మొదట ఉపాధి హామీ పథకంలో నా భార్యరత్నమ్మ, నేను కూలీగా వెళ్లాం. కొన్ని రోజులు పని చేశాను. కొద్ది రోజుల తర్వాత ఉపాధి హామీ పథకంలో బావిని తవ్వుకున్న. బాగా నీళ్లు వచ్చినయి. ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటూ, కుటుంబాన్ని పోషించుకుంటున్నా. మా ఊరోళ్లకు పది మందికి ఉపాధి కల్పిస్తున్నా. ఇది గుర్తించి అధికారులు నన్ను ఢిల్లీకి తీసుకెళ్లడం  సంతోషాన్నిచ్చింది.   - వెంకట్‌రెడ్డి, రైతు

 మా ఊరికి పేరొచ్చింది...
రాఘవాపూర్ గ్రామానికి చెందిన రైతు వెంకట్‌రెడ్డి దంపతులు ఢిల్లీకి వెళ్లి సన్మానం అందుకోవడం సంతోషకరమైంది. వెంకట్‌రెడ్డిని ఉత్తమ రైతుగా గుర్తించడంతో రాఘవాపూర్ గ్రామానికి మంచి పేరు వచ్చింది. గ్రామస్తులంతా రైతు వెంకట్‌రెడ్డిని అభినందిస్తున్నారు. ఇప్పుడు గ్రామానికి పేరు రావడం సంతోషంగా ఉంది. - రామగాని సత్తయ్యగౌడ్, సర్పంచ్,  రాఘవాపూర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement