
కశ్మీర్ టు కన్యాకుమారి
♦ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేద్దాం
♦ పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో అమిత్‌షా
న్యూఢిల్లీ: కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కృషి చేయాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పిలుపునిచ్చారు. 2014 లోకసభ ఫలితాలతోనే సంతృప్తి చెందొద్దని, 2019 లో మరింత మంచి ప్రదర్శన ఇచ్చేందుకు క్షేత్రస్థాయి నుంచి సిద్ధం కావాలని పార్టీ నాయకులను కోరారు. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అమిత్‌షా మాట్లాడారు. రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ఎంపీలందరూ పని చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ క్షేత్ర స్థాయి వరకు ప్రజ ల్లోకి వెళ్లడం లేదని, పాలనలో ‘నమో (నరేంద్ర మోదీ) ట్రాక్ రికార్డు’ను వివరించాలని సూచించారు.
గత లోకసభ ఎన్నికల్లో సాధించిన 272 సీట్లతోనే సంతృప్తి పడవద్దని, మరింత మంచి ఫలితాలు సాధించాలన్నారు. సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమం అనే మూడు ఎజెండాలతోనే రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. కాగా, బీజీపీని 1980 స్థాపించారు. లోక్‌సభలో ప్రస్తుతం 281 ఎంపీల బలం ఉంది. ఇక దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లో 1,398 ఎమ్మెల్యేలు ఉన్నారు. 13 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది.