
ప్రియాంక.. ఓ ప్రియాంక!
- యూపీలో కాంగ్రెస్ ఆశలన్నీ ఆమెపైనే..
- పార్టీ ప్రచార కమిటీ చీఫ్‌గా బాధ్యతలు ఇచ్చేందుకు నిర్ణయం
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ కాంగ్రెస్ పార్టీ ఆశలన్నీ ప్రియాంకగాంధీ చుట్టే అల్లుకుంటున్నాయి. ఇన్నాళ్లు క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమెకు యూపీ ఎన్నికల సందర్భంగా పార్టీలో పూర్తిస్తాయి బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమవుతున్నది. ప్రియాంక ప్రచారబరిలోకి దిగితే.. యూపీలో హస్తం తలరాత మారుతుందని గాఢంగా విశ్వసిస్తున్న కాంగ్రెస్ వ్యూహకర్తలు ఈమేరకు అడుగులు వేస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార కమిటీ చీఫ్‌గా ప్రియాంకగాంధీకి పదోన్నతి కల్పించవచ్చునని విశ్వసనీయంగా తెలుస్తోంది.
యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వ్యూహాలన్నీ ప్రియాంకగాంధీ కేంద్రంగానే సాగుతున్నాయి. గాంధీ-నెహ్రూ కుటుంబ వారసురాలైన ఆమెతో కనీసం ఎంతలేదన్న 120 నియోజకవర్గాల్లో ప్రచారం చేయించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఆమె ప్రచారం చేయాలని భావిస్తున్న ఈ 120 నియోజకవర్గాల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్టు సమాచారం. ఇంతవరకు తల్లి సోనియాగాంధీ రాయ్‌బరేలి, సోదరుడు రాహుల్‌గాంధీ అమేథి నియోజకవర్గాల్లో మాత్రమే ప్రియాంక ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే.
రాజకీయం అరంగేట్రం ఎప్పుడు?
ప్రియాంకగాంధీలో సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉన్నాయని పార్టీ పెద్దలు భావిస్తున్నప్పటికీ.. క్రియాశీల రాజకీయాల్లోకి రావడానికి మాత్రం ఆమె నిరాకరిస్తూ వచ్చారు. కుటుంబ నియోజకవర్గాలైన రాయ్‌బరేలి, అమేథికే ఇన్నాళ్లు పరిమితమయ్యారు. ఇప్పుడు మాత్రం ఆమెను పార్టీ నాయకురాలిగా ప్రమోట్ చేసేందుకు కాంగ్రెస్ రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. దీంతో త్వరలోనే ప్రియాంక రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఖాయమని వినిపిస్తోంది. తన భర్త రాబర్ట్ వాద్రా భూఒప్పందాలపై హర్యానా ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధింగ్రా కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఆమె ఈ విషయంలో కీలకమైన ప్రకటన చేసే అవకాశముంది. జూలై 1న ఈ కమిటీ నివేదిక రానుంది. ఆ తర్వాత రాజకీయ అరంగేట్రంపై ప్రియాంక ప్రకటన ఉండొచ్చని భావిస్తున్నారు.