భారత్, పాక్ మధ్య కవ్వింపులు
న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య కవ్వింపు చర్యలు చోటు చేసుకుంటున్నాయి. భారత నౌకా దళానికి చెందిన కమాండర్ కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ సైనిక కోర్టు అనూహ్యంగా మరణ శిక్ష విధించడం, బుధవారం నాడు పాకిస్తాన్‌కు పంపించాల్సిన ఆ దేశ నేరస్థుల విడుదలను భారత ప్రభుత్వం నిలిపివేయడం ఆ విషయాన్ని సూచిస్తున్నాయి. వారం రోజుల క్రితం పాకిస్థాన్ రిటైర్డ్ ఆర్మీ జనరల్ నేపాల్ రాజధాని కట్మాండులో కిడ్నాప్ అవడం, దాని వెనక భారత రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) ఉందని పాకిస్థాన్ ఆరోపించడం కూడా ఇక్కడ గమనార్హం.
విదేశీ చట్టం ఉల్లంఘన, బలూచిస్థాన్‌లో టెర్రరిస్టు కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తదితర అభియోగాలపై కుల్‌భూషణ్‌కు పాకిస్థాన్ మరణ శిక్ష విధించింది. యుద్ధం జరుగుతున్న సమయాల్లో తప్పించి శత్రు దేశానికి సంబంధించిన గూఢచారులకు లేదా సైనిక అధికారులకు సంబంధిత ఆరోపణలపై మరణశిక్షలు విధించరు. నిజంగా బలూచిస్థాన్ తిరుగుబాటు కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నట్లు బలమైన సాక్షాధారాలు లభించినప్పటికీ వాటిని అంతర్జాతీయ సమాజం ముందు నిరూపించాలి. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం భారత కాన్సులేట్ నిందితుడిని ప్రత్యక్షంగా కలుసుకొని అవకాశం ఇవ్వాలి. కేసును రహస్యంగా విచారించాల్సిన అవసరం కూడా లేదు.
2016, మార్చి 25వ తేదీ నుంచి 2017, మార్చి 31 తేదీ మధ్య నిందితుడు కుల్‌భూషణ్‌ను కలసుకునేందుకు ఇస్లామాబాద్‌లోని భారత ఎంబసీ 13 సార్లు పాక్ ప్రభుత్వానికి పిటిషన్లు దాఖలు చేసింది. అయినా అవకాశం ఇవ్వలేదు. కుల్‌భూషణ్ అరెస్ట్ మొదలుకొని ఆయనకు మరణ శిక్ష విధించడం వరకు చోటు చేసుకున్న పరిణామాలన్నీ వివాదాస్పదమే. కుల్‌భూషణ్‌ను పాక్‌లో అరెస్ట్ చేసినట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. 2016, ఏప్రిల్ 2వ తేదీన ఆయన్ని కొంతమంది దుండగులు కిడ్నాప్ చేసి పాక్ ప్రభుత్వానికి విక్రయించారని అఫ్ఘాన్ జర్నలిస్ట్ మాలిక్ అచాక్‌జెయిన్ అప్పట్లోనే వెల్లడించారు. 2015, డిసెంబర్ నెలలో కుల్‌భూషణ్‌ను తాలిబన్లు కిడ్నాప్‌చేసి పాక్ అధికారులకు అమ్మేశారని పాక్‌లోని జర్మన్ రాయబారి డాక్టర్ గుంటర్ మెలాక్ తెలిపారు.
పాక్ ప్రభుత్వం తీవ్రమైన అభియోగాలను కుల్‌భూషణ్ ఖండించినప్పటికీ బలూచిస్థాన్‌లోని తిరుగుబాటుదారులతో తాను సమావేశం అయ్యేందుకు ప్రయత్నించానన్న విషాయాన్ని ఆయన అంగీకరించారు. హుస్సేన్ ముబారక్ అనే దొంగ పేరుతో ఆయన పాస్‌పోర్టు కలిగి ఉన్నారనే విషయం కూడా రుజువైంది. ఆయన తమ మాజీ నౌకాదళాధికారేనని భారత ప్రభుత్వం కూడా అంగీకరించింది. పాకిస్తాన్‌లో మిలిటెంట్లను పాక్ గూఢచారులు రెచ్చకొట్టడం, వారికి సహాయ సహకారాలు అందించడం ఎంత వాస్తవమో బలూచిస్థాన్‌లో తిరుగుబాటు దారులకు భారత్ రెచ్చగొట్టడం, సహాయ సహకారాలు అందించడం అంతే సహజం.
2016, సెప్టెంబర్ నెలలో యూరీ సెక్టార్‌పై పాక్ మిలిటెంట్లు దాడి చేసినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య కవ్వింపు చర్యలు మొదలయ్యాయి. యూరీ దాడికి ప్రతీకారంగా భారత సైనికులు పాక్ భూభాగంలోకి చొచ్చుకుపోయి సర్జికల్ దాడులు జరపడం తెల్సిందే. ఇరాక్‌లో కిడ్నాపైన కుల్‌భూషణ్ పాక్‌లో తేలాడు. కట్మాండులో కిడ్నాపైన పాక్ రిటైర్ట్ ఆర్మీ జనరల్ మరెక్కడ తేలుతాడో చూడాలి.