రాణీగారు... మీ సొంతసొమ్ము ఉంది కదా!
బకింగ్‌హామ్ ప్యాలెస్ మరమ్మతుల కోసం ప్రజల సొమ్ము వాడొద్దు
లండన్: ‘ప్రజల సొమ్ముతో కాకుండా మీ సొంత డబ్బుతో రాజభవనానికి మరమ్మతులు చేయించుకోండి’ ఇది బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2కు ఆన్‌లైన్‌లో వెల్లువెత్తుతున్న విన్నపం. క్వీన్ ఎలిజబెత్ నివసించే బకింగ్‌హామ్ ప్యాలెస్‌ను నవీకరించడానికి 370 మిలియన్ పౌండ్లు (రూ. 3109 కోట్లు) ఖర్చు అవ్వనున్నట్టు బ్రిటన్ ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. దీంతో ఈ ప్యాలెస్ నవీకరణకు అయ్యే ఖర్చును రాణీ సొంత ఆస్తుల నుంచి ఖర్చు పెట్టాలని డిమాండ్ చేస్తూ 38డిగ్రీస్ క్యాంపెయిన్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌కు మద్దతుగా ఇప్పటికే 88వేలకు పైగా సంతకాలు లభించాయి. ఇంకా సంతకాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.
బ్రిటన్ రాజవంశానికి చెందిన ఈ చారిత్రక భవనం కోసం పన్నుంచెల్లింపుదారుల సొమ్మును ప్రభుత్వం ఖర్చు చేయడకూడదని ఈ పిటిషన్ కోరింది. రాణికి వ్యక్తిగతంగా 340 మిలియన్ పౌండ్ల సంపద ఉందని, అంతేకాకుండా సండ్రింగ్‌హామ్ హౌస్, బాల్‌మోరల్ కాజల్ ఉన్నాయని, కాబట్టి ఈ ఖర్చును ఆమెనే భరించాలని పిటిషన్ కోరింది. ‘ దేశంలో గృహ సంక్షోభం నెలకొని ఉంది. ప్రభుత్వ పొదుపుచర్యల కారణంగా ఎన్నో సంక్షేమ సేవలు ఆగిపోయాయి. ఇప్పుడు బకింగ్‌హామ్ ప్యాలెస్ మరమ్మతుల కోసం ప్రజలు మరింత కష్టాలు పడాలని రాజకుటుంబం కోరుతోంది. రాణికి అపారమైన సంపద ఉంది. అయినా ఇలా చేయడం గర్హనీయం’ అని యూకే చాన్స్‌లర్‌ను ఉద్దేశించి పిటిషన్‌లో పేర్కొన్నారు.