పుష్కర ప్రభంజనం | Pushkarni wave | Sakshi
Sakshi News home page

పుష్కర ప్రభంజనం

Published Sun, Jul 19 2015 12:43 AM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM

పుష్కర ప్రభంజనం

పుష్కర ప్రభంజనం

తెలంగాణలో ‘పుష్కర’ మార్గాల్లో స్తంభించిన ట్రాఫిక్
కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయిన వాహనాలు
జన జాతరగా కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం, బాసర
శనివారం ఒక్కరోజే 50 లక్షల మందికిపైగా భక్తుల పుష్కర స్నానం
సెలవులతో పెరిగిన భక్తుల సంఖ్య..    నేడు కూడా ఇదే స్థాయిలో రద్దీ

 
హైదరాబాద్: రాష్ట్రంలోని రహదారులన్నీ శనివారం పుష్కర బాట పట్టాయి. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో పెద్ద సంఖ్యలో జనం పుష్కరాలకు బయలుదేరడంతో.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. పలు చోట్ల రహదారులపై కిలోమీటర్ల పొడవునా వేలాది వాహనాలు నిలిచిపోయాయి. బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం.. ఇలా అన్ని చోట్లా ఇదే పరిస్థితి. దీంతో భక్తులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. శనివారం ఒక్కరోజే దాదాపు 50 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు చేసినట్లు అంచనా. ఇందులో ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 26 లక్షల మంది పుష్కర స్నానం చేశారు. ధర్మపురిలో ఏకంగా 10 లక్షల మంది, కాళేశ్వరంలో ఏడున్నర లక్షల మంది, భద్రాచలంలో 5 లక్షల మంది, బాసరలో లక్షన్నర మంది పుష్కర స్నానాలు చేశారు. ఆదివారం కూడా ఇదే స్థాయిలో రద్దీ నెలకొనే అవకాశమున్నట్లు అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.

వరుస సెలవుల నేపథ్యంలో గోదావరి పుష్కర స్నానానికి భక్తులు పోటెత్తారు. నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో పుష్కర స్నానాలకు 4 రోజుల్లో భక్తుల సంఖ్య సాధారణంగానే ఉంది. శనివారం సెలవు కావటంతో భక్తుల సంఖ్య పెరుగుతుందని ఊహించిన ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. కానీ రద్దీ అంచనాలను మించింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్లే జాతీయ రహదారి, హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారి కిటకిటలాడాయి. టోల్‌గేట్ల వద్ద నాలుగైదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పుష్కర ఘాట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్- నిజామాబాద్ జాతీయ రహదారిపై తూప్రాన్ టోల్‌గేట్ దగ్గర నిత్యం 11 వేల వాహనాలు ముందుకు సాగుతుండగా శనివారం ఏకంగా 67 వేల వాహనాలు వెళ్లాయి. హైదరాబాద్-విజయవాడ హైవేపై చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి, హైదరాబాద్-వరంగల్ హైవేపై బీబీనగర్ టోల్‌గేట్ల వద్ద రోజువారీ వాహనాల సంఖ్య కంటే శనివారం 18 వేలకుపైగా వాహనాలు అదనంగా వెళ్లాయి.

ఎన్ని ఏర్పాట్లు చేసినా..
పుష్కర భక్తుల తాకిడిని తట్టుకునేందుకు ఆర్టీసీ 2,600 అదనపు బస్సులు నడుపుతోంది. దక్షిణ మధ్య రైల్వే ఇటు బాసర, అటు భద్రాచలం, మంచిర్యాల, మణుగూరు వైపు దాదాపు 200 ట్రిప్పుల అదనపు రైళ్లను నడుపుతోంది. కానీ శనివారం ఇవి ఏమూలకూ సరిపోలేదు. కొన్ని పుష్కర కేంద్రాలకు ఇక భక్తులు రావొద్దంటూ అధికారులు ఓ దశలో హెచ్చరికలు కూడా చేయాల్సి వచ్చింది. పరిస్థితి తీవ్రతను ముందే ఊహించిన ముఖ్యమంత్రి ప్రధాన పుష్కర కేంద్రాలకు మంత్రులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పంపి పరిస్థితిని పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించారు. నీళ్లు తక్కువగా ఉండటంతో వరంగల్ జిల్లా మంగపేట పుష్కరఘాట్ వద్ద రోజూ 20 వేలలోపే భక్తులు వస్తుండగా.. శనివారం ఆ సంఖ్య మూడు లక్షలను దాటిందని అధికారులు చెబుతున్నారు. మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ధర్మపురిలో పుణ్యస్నానం చేశారు.
 
ఎక్కడికక్కడే..

పుష్కరాలకు భక్తులు పోటెత్తడంతో ధర్మపురికి ఇరువైపులా దాదాపు 20 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఐదారు గంటల పాటు ట్రాఫిక్  నిలిచిపోయింది. పోలీసులు, ఉన్నతాధికారులు సైతం నడుచుకుంటూ వెళ్లి ట్రాఫిక్‌ను సరిదిద్దారు. ఇక త్రిలింగ క్షేత్రమైన కాళేశ్వరం వద్ద తెల్లవారుజాము నుంచే వాహనాల రద్దీ ప్రారంభం కావడంతో కాటారం నుంచి కాళేశ్వరం వరకు దాదాపు 28 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు నాలుగు గంటల పాటు ఎక్కడి వాహనాలు అక్కడే ఉండిపోయాయి. పుష్కర పనులను పర్యవేక్షించేందుకు కాళేశ్వరం వస్తున్న మంత్రి సి.లక్ష్మారెడ్డి సైతం మూడు గంటలపాటు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయారు. మరోవైపు గోదావరి పుష్కరాలకు వెళ్లే వాహనాలతో నిజామాబాద్ జిల్లాలోనూ తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు తప్పలేదు. హైదరాబాద్-నిజామాబాద్ జాతీయ రహదారిపై ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇక భద్రాచలంలోనూ ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది.

ఖమ్మం నుంచి భద్రాచలం వరకు ప్రయాణానికి ఏకంగా 8 గంటల సమయం పట్టింది. ఆదివారం పుష్కర స్నానం చేసేందుకు శనివారం సాయంత్రం నుంచే వస్తున్న వాహనాల కారణంగా మరింత ఇబ్బంది ఎదురైంది. దీంతో భద్రాద్రికి వచ్చే వాహనాలను కొత్తగూడెం, పాల్వంచ తదితర ప్రాంతాల్లోనే నిలిపివేశారు. పుష్కరాలకు వెళ్లే వాహనాలతో నల్లగొండ జిల్లాలోని పంతంగి, గూడూరు, కేతేపల్లి టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. వరంగల్ జిల్లాలో మంగపేట, రామన్నగూడెం, ముల్లకట్ట ఘాట్ల వద్ద శనివారం మూడు లక్షల మంది పుణ్యస్నానాలు చేశారు. ఇక్కడ తాడ్వాయి -ఏటూరునాగారం, కమలాపురం-మంగపేట మధ్య నాలుగైదు కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement