అసలు కారణం ఏంటంటే..
రాజమండ్రి గోదావరి పుష్కర ఘాట్‌లో తొక్కిసలాట వెనుక అంతులేని ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోంది. పుష్కరాలను కేవలం ఒక ప్రచార కార్యక్రమంలా ప్రభుత్వం భావించడమే దీనికి కారణమని నిపుణులు అంటున్నారు. లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ కార్యక్రమంలో అనుభవజ్ఞులను, నిపుణులను భాగస్వాములను చేయకపోవడం ప్రభుత్వం అలసత్వాన్ని సూచిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రమాదం ఎందుకు జరిగిందంటే
250 మీటర్లు పొడవున్న పుష్కర ఘాట్‌కు ఉదయం 4.30 గంటల ప్రాంతం నుంచే పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించడానికి మహిళలు, చిన్నారులతో వేల కుటుంబాలు అక్కడ చేరుకున్నాయి. ఉదయం 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కరఘాట్‌కు వస్తుండడంతో వేలసంఖ్యలో చేరుకున్న భక్తులందర్నీ అధికారులు ఆపేశారు. గేట్లన్నింటినీ మూసేశారు. సీఎం చంద్రబాబు ఉదయం 6 నుంచి 7:30 వరకూ అంటే దాదాపు గంటన్నరసేపు అక్కడే గడిపారు. చంద్రబాబు ఉన్నంతవరకూ మొత్తం రాకపోకలను బంద్‌చేశారు. ఉదయం 4:30 గంటలకే వచ్చిన భక్తులంతా క్యూలైన్లలో ఉన్నారు.
మంచినీళ్లు లేవు
గంటల తరబడి క్యూలో ఉన్న భక్తులకు కనీసం సౌకర్యాలు లేకుండా పోయాయి. 12 లక్షల మంచినీళ్లు ప్యాకెట్లు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా అవి భక్తులకు చేరలేదు. దాహం తట్టుకోలేక, గంటల తరబడి నిలబడలేక నీరసించిపోయారు. చాలామంది సొమ్మసిల్లి పడిపోయారు. టాయిలెట్లు ఉన్నా.. వాటికి నీటి సరఫరా లేకపోవడంతో మహిళలు, పెద్దలు బాగా ఇబ్బంది పడ్డారు. సీఎం చంద్రబాబు ఘాట్ నుంచి వెళ్లిపోగానే గేట్లు తెరిచారు. మొత్తం మూడు ఎంట్రీల నుంచి ఒక్కసారిగా ఘాట్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వెనుక ఉన్నవారు కూడా నెట్టుకుంటూ ముందుకురావడం ప్రమాదానికి దారితీసింది. ఘాట్ మెట్లపై కొంతమంది- జనం కాళ్లకింద నలిగిపోయారు. తోపులాటతో చాలామంది .. కింద గోదావరిలో స్నానాలు చేస్తున్నవారిపై పడ్డారు. దీంతో స్నానాలు చేస్తున్నవారు నీళ్లలో మునిగి, పైకి లేవలేక, ఊపిరాడక మరణించారు. కాపాడేవారు లేక కుటుంబ సభ్యుల రోదనలతో పుష్కరఘాట్ కన్నీటి పర్యంతమైంది.
చికిత్స అందక హాహాకారాలు
తొక్కిసలాట పెద్ద ఎత్తున చోటుచేసుకోవడంతో.. అధికార యంత్రాంగం చేతులెత్తేసింది. రక్షించేందుకు పోలీసులు, నియంత్రించేందుకు సిబ్బంది... శక్తి, సామర్థ్యాలు సరిపోలేదు. ఒకచోట నుంచి మరో చోటకు వచ్చి .. బాధితులకు సహాయం చేద్దామన్నా.. ముందుకూ, వెనక్కి వెళ్లలేని పరిస్థితి. పుష్కర్‌ఘాట్ వద్ద ఉన్న మూడు అంబులెన్సులలో బాధితులను తరలించడం కష్టమైపోయింది. మృతుల సంఖ్య ఎక్కువగా ఉండటం, క్షతగాత్రులు కూడా పదుల్లో ఉండటంతో.. అప్పటికప్పుడు వారికి సాయం చేయడం అధికారుల వల్ల కాలేదు. అంబులెన్స్‌లు సరిపోకపోవడంతో తొక్కిసలాట జరిగిన రెండు గంటలవరకూ మృతదేహాలు.. ఘటనా స్థలం వద్దే ఉండిపోయాయి. ఫోన్లు కూడా పనిచేయకపోవడంతో సరైన సమాచారం రాకుండా పోయింది. సహాయ కార్యక్రమాలు చేపట్టడానికి ఇది పెద్ద అవరోధంగా మారింది.
లెక్కలు తప్పాయా?
గోదావరి పుష్కరాలపై విస్తృత ప్రచారం నిర్వహించిన ప్రభుత్వం - భక్తులకు ఏర్పాట్లు, రక్షణ, భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు వహించలేదన్నది నిపుణుల అభిప్రాయం. తొక్కిసలాట ఘటన వెనుక కూడా అధికారుల అనుభవరాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని వారు అంటున్నారు. రాజమండ్రిలో గోదావరి తీరాన 27 ఘాట్లు ఉన్నాయి. వీటిలో కోటిలింగాల ఘాట్ దాదాపు కిలోమీటరన్నర పొడవు ఉంటుంది. తొక్కిసలాట జరిగిన పుష్కరఘాట్ పొడవు విస్తరణ తర్వాత కూడా కేవలం 170 మీటర్లే. ఇక గౌతమీ ఘాట్ పొడవు 170 మీటర్లు. మొత్తంమీద రాజమండ్రిలో ఘాట్ల పొడవు 2400 మీటర్లు. నీటిపారుదల శాఖ అధికారుల అంచనా ప్రకారం ఏకకాలంలో 20 లక్షల మంది స్నానాలు చేసే అవకాశం ఉంది. 10 నిమిషాల సమయంలో ఒక చదరపు మీటరు స్థలంలో 60 మంది స్నానాలు చేయొచ్చని లెక్కలు ఇచ్చారు అధికారులు. బహుశా ఈ లెక్కలే తప్పి ఉండవచ్చనేది నిపుణుల అభిప్రాయం.
వ్యవస్థలు నిస్తేజం
సాధారణంగా పుష్కరాల లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. గోదావరి పుష్కరాలకు రోజూ 7 లక్షల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. ఏర్పాట్లు మాత్రం నాసిరకంగా ఉన్నాయి. ఎంతమంది వస్తున్నారు, ఏ ఘాట్ వద్ద ఎంతమంది ఉన్నారు వంటి విషయాలను అంచనావేయడంలో అధికారులు పూర్తి వైఫల్యం చెందారని తాజా ఘటన వెల్లడిస్తోంది. భక్తుల రద్దీపై తగిన సమాచారం తెప్పించుకుని ఆమేరకు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం, యంత్రాంగం వైఫల్యం చెందిందనే విమర్శలు వస్తున్నాయి.
- హరీష్, సీనియర్ కరస్పాండెంట్, సాక్షి టీవీ రాజమండ్రి