
'డేటు, టైమ్ ఫిక్స్ చేయండి'
హైదరాబాద్: ప్రత్యేకహోదాపై బహిరంగ చర్చకు సిద్ధమన్న సీఎం చంద్రబాబు సవాల్ ను స్వీకరిస్తున్నానని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి తెలిపారు. వేదిక, తేదీ, సమయం చంద్రబాబే నిర్ణయించాలని సూచించారు. ప్రత్యేక ప్యాకేజీ కావాలని ప్రధాని మోదీని అడిగిన మాట వాస్తవం అవునో, కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధానికి చంద్రబాబు ఇచ్చిన వినతిపత్రంలో ఏం అడిగారో తనకు తెలియదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చెప్పడం చంద్రబాబు రహస్య పాలనకు అద్దం పడుతోందన్నారు.
ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లా కేంద్రానికి వెళ్లి స్మార్ట్ సిటీ చేస్తామని చెప్పిన వెంకయ్య నాయుడు ఇప్పుడు ఏపీకి మూడు మాత్రమే ఇవ్వడంపై వివరణ ఇవ్వాలన్నారు. ఏపీలో టీడీపీ పాలన దారుణంగా ఉందనడానికి ఎలుక కరిచిన ఘటనలో చిన్నారి చనిపోవడమే నిదర్శనమని రఘువీరారెడ్డి అన్నారు.