ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారు?
లక్నో: క్రికెట్ కుంభకోణంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడి, చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అవినీతిని సహించనని చెప్పిన మోదీ ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. రెండు రోజుల అమేథి పర్యటన ముగించుకుని ఢిల్లీకి బయలుదేరే ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు.
'ఎన్నికల ప్రచారంలో కుంభకోణాల గురించి మాట్లాడుతూ అవినీతిని సహించబోనని మోదీ చెప్పారు. ఆయన అధికారంలోని పలు కుంభకోణాలు తెరపైకి వచ్చాయి. తాజాగా క్రికెట్ స్కామ్ వెలుగు చూసింది. దీన్ని వెలుగులోకి తెచ్చిన ఎంపీని(బీజేపీ నుంచి) సస్పెండ్ చేశారు' అని రాహుల్ అన్నారు.
అవినీతిని కూకటి వేళ్లతో పెకలించివేస్తానని ప్రగల్బాలు పలికారని గుర్తు చేశారు. 'నేను అవినీతిని పాల్పడను. ఎవరు అవినీతికి పాల్పడినా సహించనని అన్న మోదీ నేడు మౌనం దాల్చారు. ఆయనపై ప్రజలకు నమ్మకం పోతోంద'ని రాహుల్ అన్నారు. ఢిల్లీ జిల్లా క్రికెట్ సంఘం(డీడీసీఏ) నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.