రాహుల్ ఈజ్ బ్యాక్: అఖిలేశ్, సిద్దూతో చర్చలు..?
న్యూఢిల్లీ: ‘అవర్ బాస్ ఈజ్ బ్యాక్’.. ‘రాహుల్‌జీ ఈజ్ బ్యాక్’.. మంగళవారం తెల్లవారుజాము నుంచి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఒకటే కోలాహలం! అవును. రాహుల్ గాంధీ ఇండియాలో అడుగు పెట్టారు. విదేశాల్లో సుదీర్ఘంగా(పొలిటికల్ సిట్యువేషన్ దృష్ట్యా) విశ్రాంతి పొందిన ఆయన సోమవారం అర్ధరాత్రి తర్వాత ఢిల్లీకి చేరుకున్నారు.
మొదటిగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం ఉదయం కొడుకు రాహుల్ నివాసానికి వెళ్లారు. కొద్ది సేపటికి ప్రియాంక గాంధీ కూడా అక్కడికి చేరుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు వెళ్లిన రాహుల్ గాంధీ ఆ విశయాన్ని డిసెంబర్ 31న వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన వెంటనే రాహుల్ ఇండియాకు వచ్చేస్తారని అంతా భావించినా, ఆయన మాత్రం పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకున్న తర్వాతే ఇంటికి తిరిగొచ్చారు.
ఇదిలా ఉంటే, కీలకమైన పొత్తులు, పార్టీలోకి చేరికలు, అభ్యర్థుల జాబితా.. తదితర ఎన్నికల వ్యూహాలపై సోనియా, రాహుల్‌కు పలు సూచనలు చేసినట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు విషయంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్న ప్రియాంకా గాంధీ.. అఖిలేశ్‌తో జరిపిన చర్చల సారాంశాన్ని అన్న రాహుల్ గాంధీకి వివరించినట్లు సమాచారం. ముందుగా అనున్నప్రకారం జనవరి 9న(సోమవారం) రాహుల్‌గాంధీ- అఖిలేశ్ యాదవ్‌ల మధ్య పొత్తు చర్చలు జరగాల్సిఉంది. కానీ రాహుల్ రాక ఆలస్యం కావడంతో కొంత అస్పష్టత నెలకొంది. ఇక ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా ఎస్పీతో పొత్తుపై డిక్లరేషన్ ఇవ్వాలని రాహుల్ భావిస్తున్నారు. ఈ మేరకు అఖిలేశ్ యాదవ్‌కు కూడా కబురు పంపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
(అఖిలేశ్ ఎన్నికల పొత్తు ఎవరితోనో తెలుసా?)
యూపీ కన్నా కాంగ్రెస్ పార్టీ కీలకంగా భావిస్తోన్న పంజాబ్ విషయంలోనూ రాహుల్ గైర్హాజరీతో పలు అంశాలపై సందిగ్ధత నెలకొంది. ముఖ్యంగా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ కాంగ్రెస్‌లోకి చేరికపై స్పష్టత రావాల్సిఉంది. రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాతే కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని సిద్ధూ భావిస్తున్నారని, ఈ మేరకు అపాయింట్‌మెంట్ కూడా ఖరారైందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. అటు గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్‌లకు చెందిన కీలక నాయకులతోనూ రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. పలు రాష్ట్రాల్లో అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు గడువు సమీపిస్తుండటం.. అన్ని నిర్ణయాలు తానే తీసుకోవ్సాలిఉండటంతో రాహుల్ వచ్చే నెలరోజులూ బిజీబిజీగా గడపనున్నారు.
(సస్పెన్స్‌కు తెరదించిన సిద్దూ)