
రాహుల్ గాంధీపై విద్వేష ప్రసంగం కేసు
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై విద్వేష ప్రసంగం కేసు నమోదైంది.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై విద్వేష ప్రసంగం కేసు నమోదైంది. ఈనెల ఆరోతేదీన మహారాష్ట్రలో నిర్వహించిన ఓ ర్యాలీలో మహాత్మా గాంధీని హతమార్చింది ఆర్ఎస్ఎస్ విధానాలేనని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరి జిల్లాలో ఓ కేసు నమోదైంది. న్యాయవాది, పీపుల్ ఫర్ లీగల్ ఎయిడ్ సొసైటీ కన్వీనర్ అయిన సాను శుక్లా అనే వ్యక్తి ఈ కేసు దాఖలు చేశారు.
మహాత్మా గాంధీ హత్యలో ఆర్ఎస్ఎస్కు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి పాత్ర లేదని నిఘా సంస్థలతో పాటు కపూర్ కమిషన్ కూడా క్లీన్ చిట్ ఇచ్చాయని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కేవలం తనను బాధించడమే కాక, పూర్తిగా వాస్తవ విరుద్ధాలని, సంఘ్ పరివార్ పరువు ప్రతిష్ఠలకు తీవ్ర భంగకరమని శుక్లా ఈ సందర్భంగా చెప్పారు.