నాయనమ్మ, నాన్నల్లాగే నన్నూ చంపేస్తారేమో: రాహుల్
తన నాయనమ్మ, నాన్న కులమత రాజకీయాలకే బలైపోయారని.. అలాగే తనను కూడా ఏదో ఒకరోజు చంపేస్తారేమోనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. విద్వేష రాజకీయాలు దేశ లౌకికతత్వాన్ని దెబ్బతీస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ మతతత్వ రాజకీయాలకు పాల్పడుతోందంటూ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్లో మతఘర్షణలు జరిగిన ముజఫర్నగర్ ప్రాంతంలో తాను పర్యటించినప్పుడు హిందూ ముస్లింలు ఇద్దరితోనూ మాట్లాడానని, వాళ్ల మాటల్లో తన సొంత జీవితగాధే కనిపించిందని చెప్పారు. ''వాళ్ల దుఃఖంలో నా ముఖమే కనిపించింది. అందుకే నేను వాళ్ల (బీజేపీ) రాజకీయాలకు వ్యతిరేకం.. వాళ్లేం చేస్తున్నారు? ముజఫర్నగర్లో మంటలు పెట్టారు, గుజరాత్లో మంటలు పెట్టారు, ఉత్తరప్రదేశ్, కాశ్మీర్.. అన్నిచోట్లా ఇదే చేస్తున్నారు. వాళ్లు మంటలు పెడితే మేం ఆర్పాల్సి వస్తోంది. ఇది దేశాన్ని నాశనం చేస్తోంది'' అని రాహుల్ గాంధీ అన్నారు.
ఇలాంటి రాజకీయాలు ఆగ్రహావేశాలకు దారితీసి హింసాత్మక ఘటనలలో అమూల్యమైన ప్రాణాలు పోతున్నాయని చెప్పారు. ''మా నాయనమ్మ హత్యకు గురైంది. మా నాన్ననూ హతమార్చారు. బహుశా ఏదో ఒకరోజు నన్ను కూడా చంపేస్తారేమో. అయినా దాని గురించి నేను బాధపడట్లేదు. నా గుండెల్లో ఏముందో మీకు చెప్పాలి'' అన్నారు. ఇటీవల పంజాబ్కు చెందిన ఓ ఎమ్మెల్యే తన వద్దకు వచ్చారని, 20 ఏళ్ల క్రితం కలిసుంటే మిమ్మల్ని కూడా కోపంలో చంపేసి ఉండేవాళ్లమేమోనని ఆయన అన్నారని రాహుల్ తెలిపారు. బీజేపీ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. తన నాయనమ్మను చంపిన సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ దీపావళి రోజున ఇందిరాగాంధీపై బాంబు వేద్దామనుకున్నారని, వాళ్లమీద కోపం తనకు 10-15 ఏళ్లకుగానీ తగ్గలేదని రాహుల్ చెప్పారు.