ప్రధాని మోదీకి రాహుల్ స్ట్రాంగ్ లెటర్!
న్యూఢిల్లీ: భారత సైనిక దళాల మనోభావాలను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తున్నదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ విరుచుకుపడ్డారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్‌వోపీ) విధానాన్ని అర్థవంతంగా అమలుచేయాలని, సైనికులు తమ పెన్షన్ పొందే విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని ప్రధాని నరేంద్రమోదీని కోరుతూ రాహుల్ లేఖ రాశారు.
దేశ సైనిక దళాల నైతిక సామర్థ్యాన్ని దెబ్బతీసేవిధంగా గత కొన్నిరోజులుగా కేంద్రప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నదని రాహుల్ ఈ లేఖలో మండిపడ్డారు. ప్రతిరోజూ దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతున్న సైనికుల సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ‘భారత సైనికులు సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన కొద్దిరోజులకే అంగవైకల్యానికి సంబంధించిన పెన్షన్ విధానాన్ని కొత్తగా స్లాబ్ విధానంగా మార్చారు. దీనివల్ల వీర సైనికులు గాయపడితే వారికి ఘననీయంగా పెన్షన్ తగ్గిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా ఏడో వేతన సవరణ సంఘం కూడా సైనికులకు నిరాశే మిగిల్చింది. పౌర ఉద్యోగులతో పోలిస్తే సైనిక ఉద్యోగులకు వేతనం విషయంలో ఎంతో వివక్ష, వ్యత్యాసం కనిపిస్తోంది’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు. సైనికులకు పరిహారం, పెన్షన్ల విషయంలో కేంద్రం సక్రమమైన విధానాన్ని అవలంబించాలని ఆయన డిమాండ్ చేశారు.