మన్మోహన్ వద్ద ప్రధాని పాఠాలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై విమర్శల వర్షం కురిపించారు. ఒక కొత్త అంశాన్ని చర్చకు లేవనెత్తారు. బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కలవడాన్ని పరోక్షంగా ఉద్దేశిస్తూ మన్మోహన్ సింగ్ నుంచి నరేంద్రమోదీ దేశంలోని ప్రస్తుత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పాఠాలు నేర్చుకున్నారని చెప్పారు.బీజేపీ పాలనలో ఆర్థిక వ్యవస్థ దిగజారుతుండటంతో దాదాపు గంటపాటు తమ మాజీ ప్రధానితో భేటీ అయ్యి పాఠాలు నేర్చుకున్నారని చెప్పారు. ఢిల్లీలో ఎన్ఎస్యూఐ కన్వెన్షన్లో పాల్గొన్న ఆయన ప్రధాని నరేంద్రమోదీ, ఆరెస్సెస్పై విరుచుకుపడ్డారు. ఎవరు చెప్పినా వినే డీఎన్ఏ కాంగ్రెస్ పార్టీకి ఉందని కానీ, ఆరెస్సెస్ చెప్పిందే ఎవరైనా వినాలని చెప్పే లక్షణం మాత్రం బీజేపీకి ఉందని విమర్శించారు. ఆరెస్సెస్ సిద్ధాంతాలను ప్రజలపై రుద్దాలని మోదీ ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
ప్రధాని మోదీ విదేశాలు తిరుగుతారు కానీ, రైతుల సమస్యలు పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగోలియా వెళ్లేందుకు ఆయనకు సమయం ఉంటుందికానీ, రైతుల ఇంటికి వచ్చి వారిని పరామర్శించేందుకు ఆయనకు తీరిక లేకుండా పోయిందని చెప్పారు. కొత్తగా ఏర్పాటయిన బీజేపీ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తోందని, అన్ని వర్గాలను అణగదొక్కాలని చూస్తోందని ఆరోపించారు. ఏడాది కావొస్తున్నా.. ఇంకా నల్లధనం వెలికి తీయలేకపోయారని విమర్శించారు. మేకిన్ ఇండియా పనిచేయట్లేదని ఆయన విమర్శించారు. ఇది పెద్ద వైఫల్యంగానే మారిపోతుందని జోస్యం చెప్పారు. నల్లధనం మీద విచారణ ఎంతవరకు వచ్చిందని, అసలు ఏడాదిలో తెప్పిస్తానన్న నల్ల ధనం ఏదని ప్రశ్నించారు. ఎన్ఎస్యూఐ వర్గాలు ఆరెస్సెస్తో పోరాడి తీరాలని ఉద్బోధించారు.
కాగా, రాహుల్ వి పరిపక్వత లేని మాటలని బీజేపీ కొట్టిపారేసింది. అసలు మోదీ, మన్మోహన్ సింగ్ ఎందుకు భేటీ అయ్యారో తెలుసా అని ప్రశ్నించారు. మన్మోహన్ సింగ్ ఎందుకు వెళ్లారో తెలుసా.. యూపీఏ హయాంలో జరిగిన కోల్ స్కాం, 2జీ స్కాంల వివరాలన్నింటినీ చెప్పడానికే వెళ్లి ఉంటారన్న ఆందోళనతోనే రాహుల్ ఇలా తలాతోకా లేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ ప్రతినిధి మండిపడ్డారు.