
మరో రెండు రోజులు ఇంతే!
ఒకవైపు అల్పపీడన ద్రోణి, దానికితోడు ఉపరితల ద్రోణి కూడా ఉండటంతో రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు కూడా వాతావారణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉత్తర కర్ణాటక, కేరళ, లక్షద్వీప్ వరకు కూడా ఈ ద్రోణులు వ్యాపించి ఉన్నాయి. వీటి ప్రభావంతోనే వర్షాలు పడుతున్నాయి. కోస్తా ప్రాంతంలో కూడా ఒకరోజు తర్వాత వానలు పడతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
వేసవి ప్రారంభానికి ముందు వచ్చే ప్రీ మాన్సూన్గా వీటిని పేర్కొంటున్నారు. అయితే.. ఇప్పుడు కురుస్తున్న వర్షాల వల్ల తర్వాతి కాలంలో ఎండలు బాగా ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంటుంది. సోమవారం నాడు వర్షాలు తెలంగాణ, రాయలసీమల్లో ఎక్కువగా ఉంటాయి. తెలంగాణలో ఒకటి రెండు చోట్ల వడగళ్ల వాన పడే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల పంటలు నష్టపోయే ప్రమాదం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.