రైతు శంఖారావం వాయిదా : వై.వి.సుబ్బారెడ్డి
త్వరలోనే విజయవాడలో భారీ సభ: వై.వి.సుబ్బారెడ్డి
సాక్షి, విజయవాడ: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 4న విజయవాడలో జరుప తలపెట్టిన సమైక్య రైతు శం ఖారావం సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. సమైక్య రైతు శంఖారావం సభను విజయవంతం చేసేందుకు జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యేం దుకు ఆయన సోమవారం విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో వివిధ నియోజకవర్గాల కన్వీనర్లతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమైక్య రైతుశంఖారావం సభకు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకావాల్సి ఉందని.. అయితే సీబీఐ కోర్టు అనుమతి రాకపోవటంతో ప్రస్తుతానికి సభ వాయిదా వేస్తున్నామని, కోర్టు అనుమతి రాగానే కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులతో కలిపి పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తామని చెప్పారు.
హైదరాబాద్‌లో అక్టోబర్ 15 నుంచి 20 మధ్యలో పెద్ద ఎత్తున సమైక్య శంఖారావం సభ నిర్వహిస్తున్నారని దాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా అక్టోబర్ 2 నుంచి నవంబర్ 1 వరకు పార్టీ నిర్ణయించిన వివిధ కార్యక్రమాలను నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. జిల్లాల్లో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని.. ఉద్యమంలో వైఎస్సార్ సీపీ ముందుండాలని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
త్వరలోనే కృష్ణా, గుంటూరు జిల్లా రైతులతో విజయవాడలో భారీ ఎత్తున సభ నిర్వహిస్తామని పార్టీ కృష్ణా జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, గుంటూరు జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగే సమైక్య శంఖారావం సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన, కుక్కల నాగేశ్వరరావు, విజయవాడ నగర అధ్యక్షుడు జలీల్‌ఖాన్, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, కృష్ణా జిల్లాలోని వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొన్నారు.