విజయవాడలో ఆదివారం జరగాల్సిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి అత్యవసర సమావేశాన్ని సోమవారం మధ్యాహ్నానికి వాయిదా వేసినట్లు పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
విజయవాడ, న్యూస్‌లైన్ : విజయవాడలో ఆదివారం జరగాల్సిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి అత్యవసర సమావేశాన్ని సోమవారం మధ్యాహ్నానికి వాయిదా వేసినట్లు పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం సాయంత్రం నిర్వహించాలని భావించి పార్టీ జిల్లా క్యాడర్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అనివార్య కారణాల వల్ల ఈ సమావేశాన్ని వాయిదా వేశామని, ఈ మార్పును పార్టీ నాయకులు, కార్యకర్తలు గమనించి సహకరించాలని కోరారు.
విజయవాడ సీతారామపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న ఈ అత్యవసర సమావేశానికి పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి నియోజకవర్గ సమన్వయకర్తలు, అనుబంధ విభాగాల కన్వీనర్లు, అన్ని మండలాల కన్వీనర్లు, స్టీరింగ్ కమిటీ సభ్యులు విధిగా హాజరుకావాలని పేర్కొన్నారు.
ఇటీవల హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వచ్చే నెలాఖరు వరకు పార్టీ తరఫున చేపట్టాల్సిన కొన్ని కార్యక్రమాలపై విధివిధానాలు రూపొందించినట్లు తెలిపారు. అక్టోబర్ రెండో తేదీ నుంచి నియోజకవర్గ సమన్వయకర్తలు అందరూ వారివారి నియోజకవర్గాల్లో నిరవధిక నిరాహార దీక్షలు చేయాల్సి ఉందని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డికి కోర్టు అనుమతి ఇస్తే అక్టోబర్ నాలుగున గుంటూరులో జరపతలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు.