ప్యాన్ హవా ఖాయం
వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోకు అపూర్వ ఆదరణ
ఒంగోలు ఎంపీ అభ్యర్థి వైవీ సుబ్బారె డ్డి వెల్లడి
వల్లూరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
జిల్లాలోని లోక్‌సభతోపాటు, అన్ని అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని ఆ పార్టీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తంచేశారు. పార్టీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక వర్గాల సమ ప్రాధాన్యత ఉందన్నారు. ఆయన మంగళవారం హైదరాబాద్ నుంచి నేరుగా తిరుపతి వెళ్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని జిల్లాకు వచ్చారు. ఒంగోలు మార్గంలోని వల్లూరమ్మ, అయ్యప్ప ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా కార్యాలయంలో పార్టీ చీఫ్‌విప్ బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి పార్టీ వ్యవహారాలపై కొద్దిసేపు మాట్లాడారు. ఆ తరువాత పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. అనంతరం నివాసానికి చేరుకున్న వైవీ సుబ్బారెడ్డి అక్కడ మీడియాతో మాట్లాడుతూ...
తాను 17వ తేదీన ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తానన్నారు.పార్టీ ఎన్నికల అజెండాపై అన్ని సామాజిక వర్గాల నుంచి అపూర్వ ఆదరణ లభించిందన్నారు. పార్టీ అధినేత జగన్ ఆశయాల సాధనకు ప్రతీ ఓటరు నిబద్ధతతో పనిచేసేందుకు సిద్ధమ య్యారని వివరించారు.
పేద , మధ్యతరగతి ప్రజల కష్టాలను కళ్లారా చూసిన జగన్ రానున్న ఐదేళ్లలో అజెండాలోని అంశాలను ఆచరణలోకి తెస్తారనే నమ్మకం ప్రజలకు కలిగిందని చెప్పారు.దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పేదల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని, అదే నమ్మకం జగన్‌పై కలుగుతుందన్నారు. సీట్ల కేటాయింపునకు సంబంధించి జిల్లాలో ఎక్కడా అసంతృప్తికి తావేలేదని స్పష్టం చేశారు.
అన్ని స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ఖరారు చేసిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్‌కు దక్కుతుందన్నారు.మహానేత ఆశయాల సాధనే లక్ష్యం వైఎస్సార్‌సీపీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి
టంగుటూరుమహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాల సాధనే లక్ష్యంగా ముందుకెళతామని వైఎస్సార్‌సీపీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. వల్లూరులోని వల్లూరమ్మ దేవాలయంలో సుబ్బారెడ్డి దంపతులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో ప్రజా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసినట్లు చెప్పారు. సుబ్బారెడ్డి రాక సందర్భంగా జిల్లాలోని పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఉదయం నుంచే వల్లూరమ్మ దేవస్థానానికి చేరుకున్నారు. తిరుమలలో వెంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం బయలు దేరిన సుబ్బారెడ్డి నేరుగా వల్లూరు వచ్చారు. సుబ్బారెడ్డికి స్వాగతం పలికిన వారిలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ, కొండపి, కనిగిరి అసెంబ్లీ అభ్యర్థులు జూపూడి ప్రభాకరరావు, బుర్రా మధుసూదన్ యాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు బొట్లా రామారావు, పార్టీ నాయకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, యువజన నాయకులు కేవీ రమణారెడ్డి, వై. వెంకటేశ్వరరావు, ఢాకా పిచ్చిరెడ్డి, మండల నాయకులు కుందం హనుమారెడ్డి, సూరం రమణారెడ్డి, సోమిరెడ్డి ఉన్నారు.