మంత్రి షాకింగ్ కామెంట్స్
జైపూర్: బీజేపీ నాయకుడు, రాజస్థాన్ మంత్రి కాళిచరణ్ సరాఫ్ అనుచిత వ్యాఖ్యలతో వివాదంలో ఇరుక్కున్నారు. అత్యాచారాలను అరికట్టలేమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మైనర్ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటనపై స్పందిస్తూ ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
‘నగల దుకాణం యాజమాని ఇంట్లో పనిచేసే వ్యక్తి ఓనర్ కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు లేదా ప్రభుత్వం ఏం చేయగలుగుతుంద’ని అన్నారు. ఇలాంటి కేసులు నమోదైనప్పుడు నిందితుడిపై కఠిన చర్య తీసుకోవడం, బాధితురాలికి మంచి వైద్య సహాయం అందించడం మినహా తామేమి చేయలేమని చెప్పుకొచ్చారు.
రాజస్థాన్‌లో రేప్ కేసులు పెరిగిపోతుండడం గురించి ప్రశ్నించగా మంత్రి విచణక్ష కోల్పోయారు. ‘రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాళం వేయాలని మీరు భావిస్తున్నారా? ప్రతి గుమ్మం దగ్గర పోలీసులను కాపలా పెట్టాలా? రోజురోజుకు నేరాలు పెరుగుతున్నాయి. దీనికి మేమేం చేయగలమ’ని ఎదురు ప్రశ్నించారు. మంత్రి వ్యాఖ్యలపై విపక్షాలు, ప్రజా సంఘాలు మండిపడ్డాయి.