రిలీజ్‌కు ముందే 200 కోట్ల భారీ బిజినెస్!
బాహుబలి సినిమా బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలుకొట్టిన నేపథ్యంలో ఇప్పుడు అదేస్థాయిలో అంచనాలతో మరో దక్షిణాది సినిమా రాబోతున్నది. అదే దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రోబో-2. రజనీకాంత్, అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా 2018కి బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలునుందని భావిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా హిందీ థియేటర్ ప్రదర్శన హక్కులు ఏకంగా రూ. 80 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.
‘2.0 హిందీ ప్రదర్శన హక్కుల కోసం రూ. 100 కోట్లు ఇవ్వాల్సిందిగా నిర్మాతలు కోరారు. అయితే అంత మొత్తం చెల్లించడానికి హిందీ డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావడానికి వెనుకాడరు. అంత భారీ మొత్తం చెల్లించడం రిస్కీతో కూడుకున్న పని, కొంత తగ్గించాలని వారు కోరారు. దీంతో అనేక మంతనాల అనంతరం రూ. 80 కోట్లకు హిందీ హక్కులను కొనేందుకు డిస్టిబ్యూటర్లు ముందుకొచ్చారు. రజనీకాంత్ ఛరిష్మా, అక్షయ్‌కుమార్ ఆలిండియా పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని ఇంత మొత్తాన్ని ఇవ్వడానికి డిస్ట్రిబ్యూటర్లు ముందుకొచ్చారు’ అని డీఎన్‌ఏ పత్రిక ఓ కథనంలో తెలిపింది.
రూ. 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా భావిస్తున్నారు. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం జీ నెట్‌వర్క్ ఏకంగా రూ. 110 కోట్లు చెల్లించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు డిజిటల్ రైట్స్ కోసం అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌తో చిత్ర నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. మొత్తానికి విడుదలకు ముందే ఈ చిత్రం దాదాపు రూ. 200 కోట్ల వ్యాపారం చేసిందని, మున్ముందు మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశముందని అంటున్నారు.