ప్రధానితో రాజ్‌నాథ్ భేటీ
‘మోదీగేట్’పై చర్చ!
న్యూఢిల్లీ/జైపూర్: ఐపీఎల్ స్కామ్‌స్టర్ లలిత్ మోదీ వ్యవహారంలో ప్రభుత్వ ప్రతిష్ట రోజురోజుకు దిగజారుతున్న నేపథ్యంలో.. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రధాని కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో వారిరువురూ.. కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెలు లలిత్ మోదీకి సహకరించడంపై రాజుకున్న వివాదం, తదనంతర పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.
కాగా, సుష్మా స్వరాజ్‌కు పూర్తి మద్దతు ప్రకటించిన బీజేపీ, కేంద్ర ప్రభుత్వం.. రాజె విషయంలో మాత్రం అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. రాజస్తాన్ ఆరోగ్య శాఖ మంత్రి రాజేంద్ర రాథోర్ మాత్రం.. సీఎం పదవికి రాజె రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మరోవైపు, వసుంధర రాజె బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అపాయింట్‌మెంట్ కోరలేదని రాజే కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ వివాదంలో తన వివరణను వసుంధర రాజె బుధవారమే షాకు ఫోన్లో ఇచ్చారని సమాచారం.
ముస్లింలకు శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: ముస్లింలకు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ప్రదాని నరేంద్రమోదీ వారికి శుభాకాంక్షలు తెలిపా రు. ఈ పవిత్రమాసం ప్రతి ఒక్కరి జీవితం లో శాంతి సంతోషాలను తీసుకువస్తుందని భావిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. సమాజంలో సామరస్యాన్ని, ఐకమత్యాన్ని తీసుకువస్తుందని ఆశిస్తున్నానన్నారు.