న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖమంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా పర్యటన రద్దు అయింది. జమ్మూ కశ్మీర్లో హింసాత్మక వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17 నుంచి రాజ్నాథ్ అమెరికాలో పర్యటించాల్సి ఉంది. అయితే కశ్మీర్లో తాజా పరిణామాలతో పాటు, ఈ నెల 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా ఆయన అమెరికా పర్యటన రద్దు అయింది. కాగా హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ కాల్చివేతపై తలెత్తిన ఘర్షణలతో కశ్మీర్ అట్టుడుకుతోంది. కశ్మీర్ లోయలో నాలుగో రోజు కూడా ఉద్రిక్తత కొనసాగుతోంది. కశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.
జమ్మూకశ్మీర్ లో ఆందోళనకారులకు భద్రతాదళాలకు మధ్య కాల్పుల్లో ఇంతవరకూ 23 మంది మరణించగా, 250 మంది గాయపడ్డారు. అల్లరిమూకలు సొపొరేలో పోలీస్‌స్టేషన్‌కు నిప్పుపెట్టడంతో పాటు పుల్వామా జిల్లాలో విమానాశ్రయంపై దాడికి ప్రయత్నించారు. పలు చోట్ల భద్రతా దళాల వాహనాలపై దాడులకు పాల్పడ్డారు. కుల్గాం జిల్లాలో ఆదివారం జరిగిన హింసలో ఫిరోజ్ అహ్మద్ మిర్(22), ఖుర్షీద్ అహ్మద్ మిర్(38)లు మరణించారని పోలీసులు వెల్లడించారు. దీంతో నిన్నటికి మృతుల సంఖ్య 23కు చేరింది. శ్రీనగర్, బద్గాం జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది.
రాజ్నాథ్ అమెరికా పర్యటన రద్దు
Published Tue, Jul 12 2016 10:11 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM
Advertisement
Advertisement