unrest in Kashmir
-
కల్లోల కశ్మీర్‌పై కేంద్రం కీలక నిర్ణయం
-
కల్లోల కశ్మీర్‌పై కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : వేర్పాటు ఆందోళనలు, భారత సైన్యం తుపాకుల మోత, రాళ్లు విసిరే యువత, నడవని పాఠశాలలు, అప్రకటిత కర్ఫ్యూ.. గడిచిన ఏడాదిన్నర రోజులుగా కశ్మీర్‌లోయలో నిత్యం కల్లోల వాతావరణమే. దాదాపు వ్యవస్థలన్నీ కుప్పకూలిన కశ్మీర్‌లోయలో పరిస్థితులు తిరిగి చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ప్రయత్నాలు ప్రారంభించింది. గత ఏడాది జులైలో హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ అనంతరం చెలరేగిన ఆందోళనలు ఎంతకూ చల్లారని సంగతి తెలిసిందే. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. చర్చల ద్వారా మాత్రమే లోయలో నెలకొన్న అశాంతిని తొలగించడం సాధ్యమవుతుదని, ఆ మేరకు ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ దినేశ్వర్ శర్మను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రతినిధి ఏం చేయనున్నారు? : ‘కశ్మీరీలకు దగ్గరవ్వడం ద్వారానే వారి సమస్యలను పరిష్కరించొచ్చు’ అన్న ప్రధాని మోదీ మాటను అనుసరించి చర్చల ప్రతినిధిగా దినేశ్వర్ శర్మను నియమించారు. ఆయన.. భారత్ నుంచి విడిపోతామంటూ ఆందోళనలు చేస్తోన్న వేర్పాటువాదులతోనూ, రాజకీయ పార్టీలు, సంస్థలు, కీలక వ్యక్తులతోనూ చర్చలు జరిపి.. శాంతి పునరుద్ధరణ కోసం ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో ఆయన చేసే సూచనలను కేంద్ర కేబినెట్ పరిగణలోకి తీసుకునే వీలుంది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన మూడేళ్లల్లో కశ్మీర్ వేర్పాటువాద ఆందోళనలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
కశ్మీర్ హింసపై ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష
న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్లో పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మోదీ అధికారిక నివాసం 7 రేస్ కోర్స్‌లో జరుగుతున్న ఈ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ కాల్చివేతపై తలెత్తిన ఘర్షణల్లో ఇప్పటివరకూ 29మంది మృతి చెందగా, సుమారు 800మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై ఆయన అధికారులతో చర్చిస్తున్నారు. మరోవైపు కశ్మీర్లో బంద్ కొనసాగుతోంది. వేర్పాటువాదులు బంద్‌ను మరో రెండు రోజులు పొడిగించారు. శ్రీనగర్ సహా చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. -
రాజ్‌నాథ్ అమెరికా పర్యటన రద్దు
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికా పర్యటన రద్దు అయింది. జమ్మూ కశ్మీర్లో హింసాత్మక వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17 నుంచి రాజ్‌నాథ్ అమెరికాలో పర్యటించాల్సి ఉంది. అయితే కశ్మీర్లో తాజా పరిణామాలతో పాటు, ఈ నెల 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా ఆయన అమెరికా పర్యటన రద్దు అయింది. కాగా హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ కాల్చివేతపై తలెత్తిన ఘర్షణలతో కశ్మీర్ అట్టుడుకుతోంది. కశ్మీర్ లోయలో నాలుగో రోజు కూడా ఉద్రిక్తత కొనసాగుతోంది. కశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. జమ్మూకశ్మీర్ లో ఆందోళనకారులకు భద్రతాదళాలకు మధ్య కాల్పుల్లో ఇంతవరకూ 23 మంది మరణించగా, 250 మంది గాయపడ్డారు. అల్లరిమూకలు సొపొరేలో పోలీస్‌స్టేషన్‌కు నిప్పుపెట్టడంతో పాటు పుల్వామా జిల్లాలో విమానాశ్రయంపై దాడికి ప్రయత్నించారు. పలు చోట్ల భద్రతా దళాల వాహనాలపై దాడులకు పాల్పడ్డారు. కుల్గాం జిల్లాలో ఆదివారం జరిగిన హింసలో ఫిరోజ్ అహ్మద్ మిర్(22), ఖుర్షీద్ అహ్మద్ మిర్(38)లు మరణించారని పోలీసులు వెల్లడించారు. దీంతో నిన్నటికి మృతుల సంఖ్య 23కు చేరింది. శ్రీనగర్, బద్గాం జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది.