రాజ్యసభలో గందరగోళం, సోమవారానికి వాయిదా
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ సభ్యుడి బిల్లుపై చర్చ జరగకుండానే రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. ప్రైవేట్ బిల్లుపై చర్చకు కాంగ్రెస్ సభ్యులు పట్టుబడుతూ నినాదాలు చేయడంతో గందరగోళం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ మాట్లాడుతూ ఈ వ్యవహారంపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాను బీజేపీ అడ్డుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. హోదాపై కేంద్రం అధికారికంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు అనూహ్యంగా అధికార బీజేపీ సభ్యులు పోడియం ముందుకొచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆప్ ఎంపీ భగవంత్ మన్పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అధికార, విపక్ష సభ్యుల ఆందోళనలు, నిరసనల మధ్య సభ దద్దరిల్లింది. ఈ నేపథ్యంలో విపక్ష సభ్యులు జోక్యం చేసుకుని సభ్యుల హక్కులను అధికార పార్టీ కబళిస్తోందని ఆరోపించారు. అయితే సభా కార్యక్రమాలు సజావుగా నిర్వహించడం తన బాధ్యతని డిప్యూటీ ఛైర్మన్ అన్నారు. అధికార పార్టీ సభ్యులు సభలోకి వచ్చి నినాదాలు చేయడం సబబు కాదని అన్నారు. అయినప్పటికీ బీజేపీ సభ్యులు శాంతించకపోవడంతో డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభను సోమవారానికి వాయిదా వేశారు. కాగా ఈ రోజు ఉదయం నుంచి రాజ్యసభ మూడుసార్లు వాయిదా పడింది.