ర్యాన్‌బాక్సీ డీలిస్టింగ్ | Ranbaxy dilisting | Sakshi
Sakshi News home page

ర్యాన్‌బాక్సీ డీలిస్టింగ్

Published Thu, Mar 26 2015 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 11:22 PM

ర్యాన్‌బాక్సీ డీలిస్టింగ్

ర్యాన్‌బాక్సీ డీలిస్టింగ్

ముంబై: ర్యాన్‌బాక్సీ ల్యాబొరేటరీస్ షేర్ల ట్రేడింగ్ బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో వచ్చే నెల 6 నుంచి ఆగిపోనున్నది. ఈ కంపెనీ సన్‌ఫార్మా కంపెనీలో విలీనమవుతున్నందున ఆ రోజు నుంచి ర్యాన్‌బాక్సీ షేర్లు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ కావు. వచ్చే నెల 1వ తేదీ వీటి ట్రేడింగ్‌కు చివరి తేదీ. (వచ్చే నెల 2న మహావీర్ జయంతి, 3న గుడ్‌ఫ్రైడ్ సందర్భంగా స్టాక్ మార్కెట్‌కు సెలవు) ర్యాన్‌బాక్సీ కంపెనీని 400 కోట్ల డాలర్లకు  సన్ ఫార్మా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ విలీనానికి అన్ని రకాలైన అనుమతులు లభించడంతో ర్యాన్‌బాక్సీని స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల నుంచి సన్ ఫార్మా  డీలిస్ట్ చేయనున్నది.

ర్యాన్‌బాక్సీ వాటాదారులకు  షేర్ల కేటాయింపుకు ఏప్రిల్ 7వ తేదీని రికార్డ్ డేట్‌గా సన్‌ఫార్మా నిర్ణయించింది. రూ.5 ముఖ విలువ గల 10 ర్యాన్‌బాక్సీ షేర్లకు రూ.1 ముఖ విలువ గల సన్ ఫార్మా షేర్లు ఎనిమిదింటిని కేటాయిస్తారు. ఈ విలీనం కారణంగా సన్‌ఫార్మా ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఫార్మా కంపెనీగా అవతరించనున్నది. ఈ నేపథ్యంలో సన్ ఫార్మా 1.4 శాతం వృద్ధితో రూ.1,052 వద్ద, ర్యాన్‌బాక్సీ కూడా 1.4 శాతం వృద్ధితో రూ.831 వద్ద ముగిశాయి.

ఆర్‌అండ్‌డీపై మరింత దృష్టి...: సంఘ్వీ

ర్యాన్‌బాక్సీ విలీనం పూర్తి కావడంతో ఇకపై పరిశోధన, అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ) కార్యకలాపాలను మరింతగా విస్తరించనున్నట్లు సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీ చెప్పారు. ఇరు సంస్థల కలయికవల్ల రాబోయే మూడేళ్లలో 250 మిలియన్ డాలర్ల మేర ప్రయోజనం చేకూరగలదన్నారు. అయిదు ఖండాల్లో 150 పైగా దేశాల్లో తమ ఉత్పత్తుల విక్రయం జరుగుతుందని సంఘ్వీ తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement