
గతేడాది హాటెస్ట్ కీవర్డ్ అదే!
దిల్లీ: గత ఏడాదిలో సెల్‌ఫోన్ వినియోగదారులు ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్లలో అత్యధికంగా ‘రిలయన్స్ జియో’ గురించి శోధించారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ తర్వాత స్థానాల్లో ఉన్నారు. 2016లో ‘ రిలయన్స్ జియో’ హాటెస్ట్ కీవర్డ్ అని అలీబాబా గ్రూప్ సంస్థ యూసీ న్యూస్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఉచిత 4జీ సేవలతో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియోను 11.60 కోట్ల మంది ఇంగ్లీషు, హిందీ భాషల్లో వెతికారని వెల్లడించింది.
విరాట్ కోహ్లి గురించి 10.80 కోట్ల మంది, సల్మాన్‌ఖాన్ కోసం 6.4 కోట్ల మంది శోధించినట్టు తెలిపింది. హిందీలో 5.6 కోట్ల సల్మాన్ పేరుతో వెతుకులాడగా, ఇంగ్లీషులో కేవలం 80 లక్షల మంది మాత్రమే వెతికారు. ఆంగ్ల పాఠకుల్లో అత్యధికంగా వెతికిన హీరోయిన్లలో ప్రియాంకాచోప్రా ముందు నిలిచారు. ఆంగ్ల పాఠకుల్లో 80 లక్షల మంది ప్రియాంకాచోప్రా పేరుతో, హిందీ పాఠకుల్లో 4.5 కోట్ల మంది కరీనా కపూర్ పేరుతో శోధించారు.