ఆఫర్ పెంచనున్న జియో?
Published Thu, Jan 19 2017 10:05 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 AM
ముంబై: ఆరు నెలల పాటు ఉచిత కాల్స్, డేటా సేవలు అందిస్తూ వస్తున్న రిలయన్స్ జియో తన ఆఫర్‌ను మరో మూడు నెలలు పొడిగించనుందా? తాజాగా వస్తున్న వార్తలు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. అయితే మూడు నెలల పాటు పెంచే ఉచిత సేవలను వినియోగించుకోవడానికి చిన్నమొత్తంలో రుసుము విధించాలని జియో యోచనలో ఉన్నట్లు తెలిసింది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో మొదట వెల్‌కమ్ ఆఫర్ పేరిట మూడు నెలల పాటు ఉచిత సేవలను అందించిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత 'హ్యాపీ న్యూఇయర్ ఆఫర్' పేరిట ఈ ఏడాది మార్చి 31 వరకు దాన్ని పొడిగించింది. ఇటీవలే 7.2 కోట్ల వినియోగదారుల మైలురాయిని అందుకున్న జియో తమ ఖాతాదారులను మరింత ఆకట్టుకునే దిశగా సాగుతోంది. తక్కువ మొత్తంలో రీచార్జ్ ద్వారా డేటాతో పాటు ఉచిత కాల్స్‌ను అందించాలనే ఆలోచనలో ఉంది.
కేవలం రూ.100కే అందించే ఈ ఆఫర్ ను ఈ ఏడాది జూన్ వరకూ కొనసాగించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఆఫర్ సమయం ముగిసేలోగా కాల్‌డ్రాప్ సమస్యను పరిష్కరించుకోవాలని జియో భావిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే జియో దెబ్బకు మిగిలిన టెలికం సంస్థలు డేటా ఛార్జీలను భారీగా తగ్గించాయి. కొన్ని ప్రత్యేక ప్యాక్‌ల ద్వారా ఉచిత కాల్స్ సదుపాయాన్నీ ఆయా కంపెనీలు అందిస్తున్నాయి.
Advertisement
Advertisement