ఎం-సెట్‌లో ఒక ప్రశ్నకు సమాధానంపై అస్పష్టత
ప్రాథమిక ‘కీ’కి... తుది ‘కీ’కి విభిన్న సమాధానాలు
హైకోర్టుకెళ్లిన విద్యార్థులు
ప్రాథమిక ‘కీ’ సమాధానమే సరైనదని నిర్ధారించిన కోర్టు
హైదరాబాద్: ప్రైవేటు వైద్య, దంత కళాశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో 35 శాతం మేనేజ్‌మెంట్ల సీట్లకు గత నెల మూడో తేదీన జరిగిన వైద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎం-సెట్)లో ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంపై గందరగోళం నెలకొంది. పరీక్ష అయిన రోజు ప్రాథమికంగా విడుదల చేసిన సమాధానాల ‘కీ’కి... అనంతరం విడుదల చేసిన తుది ‘కీ’కి ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో తేడా వచ్చింది. దీంతో గందరగోళం నెలకొంది. ప్రశ్నపత్రంలో రసాయన శాస్త్రానికి సంబంధించిన ఒక ప్రశ్నకు 4 రకాల సమాధానాలు ఇవ్వగా... నాలుగోది సరైన సమాధానమని ప్రాథమిక ‘కీ’లో ప్రకటించారు. తర్వాత విడుదల చేసిన తుది ‘కీ’లో మాత్రం మొదటి సమాధానం సరైనదిగా ప్రకటించారు. తుది ‘కీ’ ప్రకారమే విద్యార్థుల మార్కులను అప్పట్లో ఎం-సెట్ కన్వీనర్ విడుదల చేశారు. దీనిపై అభ్యంతరం తెలుపుతూ కొందరు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు.
ప్రాథమిక ‘కీ’లో ప్రకటించిన నాలుగో సమాధానమే సరైనదిగా హైకోర్టు నిర్ధారించింది. ఈ తీర్పును ఆధారం చేసుకొని మొదట వెలువరించిన ఫలితాలను సవరించి మళ్లీ రెండోసారి విద్యార్థుల మార్కుల జాబితాను ఎం-సెట్ కన్వీనర్ ప్రకటించారు. దీంతో ఒక మార్కు తేడాతో కొందరు విద్యార్థులు నష్టపోగా... 70 మంది వరకు కొత్తగా అర్హత సాధించినట్లు తెలిసింది. ఒక మార్కుతో పరిస్థితి అటూ ఇటూ అయింది. త్వరలో ఇంటర్ మార్కులను ఆధారం చేసుకొని ర్యాంకులు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక మార్కు తక్కువ పొందినవారు ర్యాంకుల వద్దకు వచ్చేసరికి చాలా వెనక్కుపోయే పరిస్థితి ఏర్పడింది. మరికొందరు ముందుకు వచ్చే పరిస్థితి ఏర్పడనుంది.
జేఎన్‌టీయూ ఆధ్వర్యంలోనే ప్రశ్నపత్రం
ఎం-సెట్ ప్రవేశ పరీక్ష ప్రైవేటు వైద్య కళాశాలల నేతృత్వంలో జరిగింది. మొత్తం 5,130 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. దాదాపు 2,500 మంది వరకు అర్హత సాధించారు. ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలోనే పరీక్ష జరిగినా ప్రశ్నపత్రాన్ని హైదరాబాద్ జేఎన్‌టీయూ తయారు చేసింది. పరీక్ష నిర్వహణ బాధ్యత టీసీఎస్ చేపట్టిన సంగతి తెలిసిందే.
ఇప్పటి‘కీ’ గందరగోళమే
Published Wed, Jul 15 2015 1:38 AM | Last Updated on Sun, Sep 3 2017 5:29 AM
Advertisement