టీ-బిల్లునేడు ఖరారు! | Report of GoM on Telangana may come to cabinet next week | Sakshi
Sakshi News home page

టీ-బిల్లునేడు ఖరారు!

Published Thu, Nov 21 2013 2:28 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

టీ-బిల్లునేడు ఖరారు! - Sakshi

టీ-బిల్లునేడు ఖరారు!

 న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) నివేదికను, తెలంగాణ బిల్లు ముసాయిదాను గురువారం ఖరారు చేయనుంది. జీవోఎం సభ్యులంతా గురువారం ఉదయం సమావేశమై నివేదికను ఖరారు చేసి ఆమోదించనున్నారు. అయితే.. ముందుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు గురువారం సాయంత్రం జరగబోయే కేంద్ర మంత్రివర్గ సమావేశం ముందుకు ముసాయిదా బిల్లు, జీవోఎం నివేదికలు వస్తాయా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. గురువారం ఉదయం జరగబోయే జీవోఎం సమావేశమే చివరిదని.. విభజనపై నివేదికను ఖరారు చేసి కేబినెట్ ఆమోదానికి పంపుతామని జీవోఎం సభ్యుడైన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాంరమేశ్ పేర్కొన్నారు.
 
 కానీ.. జీవోఎం సారథి, కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే అందుకు విరుద్ధంగా చెప్పారు. కీలకమైన నివేదికను ఇంత తొందరగా ఖరారు చేయలేమని ఇంకా ఒకటి, రెండు సార్లు జీవోఎం సమావేశాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. గురువారం నాటి కేబినెట్ సమావేశానికి నివేదిక వెళ్లకపోవచ్చని కూడా చెప్పారు. మరోవైపు.. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఎన్నికల ప్రచారం నిమిత్తం జైపూర్ పర్యటనకు వెళుతున్నందున గురువారం జరగాల్సిన కేంద్ర కేబినెట్ భేటీ వాయిదా పడిందని వార్తలు వచ్చాయి. జీవోఎం నివేదికకు గురువారం తుది మెరుగులు దిద్దుతుందని.. నివేదికతో పాటు, తెలంగాణ ముసాయిదా బిల్లు వచ్చే వారంలో కేంద్ర కేబినెట్ ముందుకు వస్తుందని కేంద్ర హోంశాఖ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ పేర్కొంది.
 
 జీవోఎం భేటీలో కొప్పుల రాజు...
 రాష్ట్ర విభజన విధివిధానాలపై.. రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఇరు ప్రాంతాల కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రిలతో ఇప్పటికే సంప్రదింపులు పూర్తిచేసిన జీవోఎం.. బుధవారం కూడా విభజన నివేదిక ఖరారుపై కసరత్తు కొనసాగింది. హోంమంత్రి చాంబర్లో షిండే, జైరాంరమేశ్‌లు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై సుదీర్ఘ కసరత్తు చేశారు. జీవోఎం సమావేశానికి రిటైర్ట్ ఐఏఎస్ అధికారి, ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజును ప్రత్యేకంగా పిలిపించారు. ఆంధ్రప్రదేశ్‌పై పూర్తి అవగాహన కలిగిన రాజు వారికి ఏం చెప్పారనేది ప్రాధాన్యత సంతరించుకుంది.
 
 వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, హైదరాబాద్, ప్యాకేజీ వంటి అంశాలకు సంబంధించి రాజు అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. కేంద్ర హోంశాఖ వర్గాలు  చెప్తున్న దాని ప్రకారం.. హైదరాబాద్, ప్యాకేజీ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, సాగునీరు, విద్యుత్, విద్య వంటి అంశాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సహా తెలంగాణ, సీమాంధ్ర నేతలు, వివిధ పార్టీలు లెవనెత్తిన అంశాలను క్రోడీకరించి జీవోఎం నివేదికను ఖరారు చేశారు. గురువారం  జీవోఎం సభ్యులందరితో సమావేశమై అందరి ఆమోదంతో జీవోఎం నివేదికను, విభజన బిల్లు ముసాయిదాను కేబినెట్‌కు పంపించే ప్రయత్నాల్లో ఉన్నారు. జీవోఎం భేటీ ముగిసిన తర్వాత షిండే.. మీడియాతో మాట్లాడుతూ నివేదికను ఖరారు చేయటానికి ముందుగా ఇంకా ఒకటి, రెండు సార్లు జీవోఎం సమావేశాలు జరుగుతాయని చెప్పారు. ఆ తరువాత వచ్చిన జైరాంరమేశ్ మాత్రం షిండే వ్యాఖ్యలకు భిన్నంగా.. గురువారం భేటీలోనే నివేదికను ఖరారు చేసి కేబినెట్‌కు పంపుతామని చెప్పారు.
 
 సీమాంధ్ర కేంద్ర మంత్రుల తుది ప్రయత్నాలు...
 జీవోఎం నివేదిక రూపకల్పన తుది దశకు చేరుకుందని తెలుసుకున్న సీమాంధ్ర కేంద్రమంత్రులు ప్యాకేజీల కోసం తాము చేసిన డిమాండ్లను అందులో పొందుపరిచే లా చివరి ప్రయత్నాలు చేస్తున్నారు.  కావూరి సాంబశివరావు, చిరంజీవి, జె.డి.శీలం, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి బుధవారం సాయంత్రం సంయుక్తంగా వెళ్లి జీవోఎం సభ్యులు సుశీల్‌కుమార్‌షిండే, ఎ.కె.ఆంటోని, వీరప్పమొయిలీ, జైరాంరమేశ్‌లను మరోసారి వేర్వేరుగా కలిశారు. విభజనకు పూర్తిగా సహకరిస్తున్నందున తమ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. సీమాంధ్రులు సంతృప్తి చెందాలంటే హైదరాబాద్‌ను యూటీ చేయాల్సిందేనని సూచించారు.
 
 ‘యూటీ’ సాధ్యం కాదన్న జీవోఎం సభ్యులు...
 తొలుత జైరాంరమేశ్, ఆంటోనీలను కలిసి ఈ ప్రతిపాదన తీసుకురాగా వారు తోసిపుచ్చినట్లు తెలిసింది. సీడబ్ల్యూసీ తీర్మానానికి అనుగుణంగానే తమ కసరత్తు కొనసాగుతోందని, యూటీ సాధ్యం కాదని వారు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో.. ీ కొత్త రాజధాని నిర్మాణానికి భారీ ప్యాకేజీని ప్రకటించటంతో పాటు సీమాంధ్రలో ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ వంటి సంస్థలన్నిటినీ ఏర్పాటు చేసేలా సిఫారసు చేయాలని ఆ ప్రాంత కేంద్రమంత్రులు కోరారు. ఈ అంశాలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలవాలని జైరాం సూచించినట్లు తెలిసింది. ఆంటోనీ మాత్రం మంత్రులు చెప్పిన విషయాలను వినేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదని తెలిసింది. సీమాంధ్ర మంత్రులు తర్వాత మొయిలీ,షిండేలను కలిసి తమ ప్రతిపాదనలకు అనుగుణంగా నివేదికలో పరిష్కారాలు చూపాలని కోరారు. వారి నుంచి సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది. దీంతో గురువారం సోనియాని కలవాలని భావించిన నేతలు అపాయిట్‌మెంట్ కోరినట్లు తెలిసింది.
 
 శీతాకాల భేటీలోనే ఆమోదం: మొయిలీ
 పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నట్లు వీరప్పమొయిలీ చెప్పారు. బుధవారం  సీమాంధ్ర కేంద్రమంత్రులు కలిసి వెళ్లిన అనంతరం ఆయన కొన్ని టీవీ చానళ్లతో మాట్లాడుతూ జీవోఎం రూపొందించే నివేదిక కేంద్ర కేబినెట్ ముందుకు ఎప్పుడు వస్తుందో చెప్పలేనని పేర్కొన్నారు. జీవోఎం సిఫారసులను మాత్రం ఈ నెలాఖరు లోగా ఖరారు చేస్తామన్నారు. విభజన వల్ల ఇరు ప్రాంతాలపై చూపే ప్రభావమున్న అన్ని అంశాలపై లోతుగా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. అన్ని ప్రాంతాల ప్రజలు సంతృప్తి చెందేలా పరిష్కారాలు చూపే దిశగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ అంశాలపైనే సీమాంధ్ర మంత్రులతో చర్చించామని తెలిపారు. మరోవైపు హోంమంత్రి షిండే జీవోఎం సమావేశానికి వచ్చే ముందు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో సమావేశమై వచ్చినట్లు తెలిసింది. వీరిద్దరు ఏయే అంశాలు చర్చించారనేది మాత్రం తెలియలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement