ముంబై: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు సంబంధించిన నిబంధనలను ఆర్‌బీఐ సడలించింది. దీని ప్రకారం ఎఫ్‌డీఐలు స్టాక్స్ లేదా బాండ్‌లలో చేసిన పెట్టుబడి వాటాలను విక్రయించే అవకాశం ఉంటుంది. ఎఫ్‌డీఐ కాంట్రాక్టులకు ఇకపై ఉపసంహరణకు వీలుగా ఆప్షన్ క్లాజ్‌లను చేరుస్తూ నిబంధనలను ఆర్‌బీఐ మార్చింది. కనీస లాకిన్ వ్యవధి, ఎలాంటి కచ్చితమైన రాబడులూ లేకపోవడం వంటి షరతులకు లోబడి ఈ ఎగ్జిట్‌కు అవకాశం లభిస్తుందని ఆర్‌బీఐ పేర్కొంది. ఇప్పటిదాకా విదేశీ ఇన్వెస్టర్లకు ఎఫ్‌డీఐ పాలసీ కింద ఈక్విటీ షేర్లు, కచ్చితంగా మార్చుకునే వీలున్న ప్రిఫరెన్స్ షేర్లు లేదా డిబెంచర్లను జారీ చేసేందుకు అవకాశం ఉంది. వీటికి ఎలాంటి ఆప్షన్ క్లాజ్‌లూ లేవని ఆర్‌బీఐ వెల్లడించించింది. కాగా, ప్రవాసభారతీయులు ప్రస్తుత లేదా కొత్త బ్యాంక్ ఖాతాల్లో తమ సన్నిహిత కుటుంభసభ్యులను ఉమ్మడి ఖాతాదారులుగా చేర్చుకోవచ్చని ఆర్‌బీఐ మరో నోటిఫికేషన్‌లో పేర్కొంది.