రిలయన్స్ కేజీ-డీ6లో గ్యాస్ ఉత్పత్తి పెంపు
న్యూఢిల్లీ: కేజీ-డీ6 క్షేత్రాల్లో గ్యాస్ ఉత్పత్తి క్షీణతకు రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) అడ్డుకట్ట వేసింది. ఇక్కడి ఎంఏ-గ్యాస్ క్షేత్రంలోని ‘ఎంఏ-8’ కొత్త బావిలో ఈ నెల 2 నుంచి ఉత్పత్తిని ప్రారంభించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గడిచిన నాలుగేళ్లలో ఆర్‌ఐఎల్ కొత్తగా అభివృద్ధి చేసిన తొలి బావి ఇదే కావడం గమనార్హం. కాగా, కేజీ-డీ6 గ్యాస్ బ్లాక్‌లో ప్రస్తుతం గ్యాస్ ఉత్పత్తి రోజుకు 13.7 మిలియన్ ఘనపు మీటర్ల(ఎంఎస్‌ఎండీ)కు పెరిగినట్లు ఆయా వర్గాలు వెల్లడించాయి. ఇందులో డీ1, డీ3 క్షేత్రాల నుంచి 8.7 ఎంసీఎండీలు, ఎంఏ క్షేత్రం నుంచి 5 ఎంసీఎండీల చొప్పున ఉత్పత్తి జరుగుతోందని తెలిపాయి. గత నెలలో ఇక్కడ మొత్తం ఉత్పత్తి కొత్త ఆల్‌టైమ్ కనిష్టమైన 11.7 ఎంఎస్‌ఎండీలకు పడిపోయిన సంగతి తెలిసిందే.
ఎంఏ-8 బావి ప్రస్తుతం స్థిరీకరణ ప్రక్రియలో ఉందని.. రోజుకు 1.5 ఎంసీఎండీల గ్యాస్ ఉత్పత్తి జరుగుతోందని అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో 2.5 ఎంసీఎండీలకు పెరగవచ్చని అంచనా. ఇదిలాఉండగా.. డీ1, డీ3లలో మొత్తం 18 బావులకుగాను మూసేసిన 10 బావుల్లో మూడో వంతును తిరిగి ఉత్పత్తికి సిద్ధం చేసేందుకు రిలయన్స్ మరమ్మతులు చేపడుతోంది. ఎంఏ క్షేత్రంలో కూడా ఆరు బావులకుగాను రెండు బావులను కూడా కంపెనీ మూసేసింది. ప్రధానంగా బావుల్లోకి ఇసుక, నీరు చేరడం ఇతరత్రా భౌగోళిక అంశాలే కారణమని రిలయన్స్ చెబుతూవస్తోంది. అయితే, తగినన్ని బావులను తవ్వకపోవడంవల్లే ఉత్పత్తి పాతాళానికి పడిపోయిందని అటు నియంత్రణ సంస్థ డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్(డీజీహెచ్), పెట్రోలియం శాఖ అధికారులు వాదిస్తున్నారు. 2009 ఏప్రిల్‌లో కేజీ-డీ6లో రిలయన్స్ గ్యాస్, చమురు ఉత్పత్తిని పారంభించింది. 2010 మార్చిలో 69.5 ఎంసీఎండీల గరిష్టస్థాయిని తాకింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి గ్యాస్ ధరను రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీంతో యూనిట్ ధర 4.2 డాలర్ల నుంచి 8.4 డాలర్లకు ఎగబాకనుంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తి పెంపు చర్యలను ముమ్మరం చేస్తుండం గమనార్హం.