అంతర్జాతీయ శాస్త్రవేత్తల హెచ్చరిక
లాస్‌ఏంజెలిస్: ఉత్తర భారతంతోపాటు పశ్చిమ నేపాల్‌కు భవిష్యత్తులో మరో పెను భూకంప ముప్పు పొంచి ఉందని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఏప్రిల్‌లో నేపాల్‌లో వచ్చిన భారీ భూకంపంలో భూమి పొరలో లోపం(ఫాల్ట్) వద్ద కొంత శక్తి మాత్రమే విడుదలైందని, ఆ ఫాల్ట్ వద్ద ప్రస్తుతం ఇంకా చాలా ఒత్తిడి కొనసాగుతోందని తెలిపారు. జీపీఎస్ కేంద్రాలు, కఠ్మాండులో నేల కదలికలను పసిగట్టే యాక్సిలరోమీటర్ రాడార్ చిత్రాల నుంచి అందిన సమాచారాన్ని అధ్యయనం చేయగా ఈ విషయం తేలిందని అమెరికాలోని కాల్‌టెక్, వర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి శాస్త్రవేత్తలు తెలిపారు.
నేపాల్‌లో రిక్టర్‌స్కేలుపై 7.8 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపంలో 9 వేల మంది మరణించడం తెలిసిందే. దీనిపై అధ్యయనం చేసిన వీరు.. పశ్చిమ నేపాల్‌తో పాటు ఉత్తర భారత్‌లో అనేక చోట్ల జనసమ్మర్ద ప్రాంతాలున్నాయని, గంగా మైదానంలో భూకంపమొస్తే పెను విలయం తప్పదని అన్నారు. యురేసియా భూఫలకంతో ఇండియన్ ప్లేట్ కలిసే చోట ఉన్న హిమాలయన్ ఫాల్ట్ లైన్ వద్దే ఇటీవలి భూకంపం సంభవించిందన్నారు. ఈ ఫాల్ట్ భాగం లాక్ అయిపోయిందని, భవిష్యత్తులో రెండు ప్లేట్ల మధ్య ఒత్తిడి వల్ల సర్దుబాటు జరిగి ఇంతకంటే పెను భూకంపానికి దారి తీయవచ్చన్నారు.
ఉత్తర భారతానికి పెను భూకంప ముప్పు!
Published Sat, Aug 8 2015 1:31 AM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM
Advertisement
Advertisement