
రూ.5 వేల కోట్లు దోచుకున్నారు: రఘువీరా
కొవ్వూరు (పశ్చిమగోదావరి) : టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇసుక అక్రమ వ్యాపారం ద్వారా ఏడాదిన్నర కాలంలో రూ.5 వేల కోట్లు దోచుకున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు, తాళ్లపూడి, దేవరపల్లి, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో శనివారం పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ఆయిల్‌పామ్, చెరకు, పొగాకు రైతులు, పింఛన్లు రాని వృద్ధులు, డ్వాక్రా మహిళలతో పీసీసీ బృందం సభ్యులు భేటీ అయ్యారు. రఘువీరా మాట్లాడుతూ.. డ్వాక్రా మహిళల పేరుచెప్పి సాగిస్తు న్న ఇసుక అక్రమాలపై అవసరమైతే మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. చెరకు తోలిన రైతులకు షుగర్ ఫ్యాక్టరీలు వారం, పది రోజు ల్లోగా డబ్బు చెల్లించకపోతే వారి తరఫున ఉద్యమం చేపడతామని హెచ్చరిం చారు.
కాంగ్రెస్ సంబరానికి పావురాలు ఆహుతి
స్వేచ్ఛకు, శాంతికి చిహ్నమైన తెల్లటి పావురాలను తమ సంబరాల కోసం కాంగ్రెస్ నాయకులు చంపేశారు. పావురాలను తారాజువ్వలో ఉంచి నిప్పుపెట్టి వినోదం చూశారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో శనివారం ఈ ఘటన జరిగింది. కొవ్వూరు రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి దగ్గర రఘువీరాకు స్వాగతం పలికేందుకు వచ్చిన కార్యకర్తలు ఈ చర్యకు పాల్పడ్డారు. తారాజువ్వకు పైభాగంలో పావురాల్ని ఉంచగా అవి మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనపై కొవ్వూరుకు చెందిన గంధం పూజ్య బాపూజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ పవన్‌కుమార్ తెలిపారు. దీనిపై అటవీ శాఖకు చెందిన సిబ్బంది విచారణ చేపట్టారు.