అభిప్రాయం
రాచరిక ప్రభుత్వాలు, నియంతృత్వ ప్రభుత్వాల కంటే ప్రజాస్వామిక ప్రభుత్వాలు... సంక్షేమ ప్రభుత్వాలుగా ప్రజల కోసం, ముఖ్యంగా పేద ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం బాధ్యతాయుతంగా పనిచేస్తాయని బలంగా విశ్వసిస్తారు. ప్రపంచంలో పేదలు అధికంగా ఉన్న దేశాలలో భారతదేశం కూడా ఒకటి. దేశంలో 25 కోట్ల మంది పేదరికంలో ఉన్నారనీ, దాదాపు 11.2 శాతం మంది దారిద్య రేఖ దిగువన నివసిస్తున్నారనీ 2023లో నీతి ఆయోగ్ విడుదల చేసిన తన రిపోర్టులో వెల్లడి చేసింది.
దేశంలో 80 కోట్ల పేద కుటుంబాలు ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ లాంటి పథకాల ద్వారా ఉచిత రేషన్ బియ్యం పొందుతున్న దేశంలో ఇటీవల 18వ లోక్ సభకు జరిగిన ఎన్నికలలో 93 శాతం మంది కోటీశ్వరులు, 50 శాతం మంది క్రిమినల్ కేసులు ఉన్నవారు లోక్ సభ సభ్యులుగా ఎన్నికయ్యారని ‘అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫారమ్స్’ (ఏడీఆర్) సంస్థ తన అధ్యయనంలో వెల్లడి చేసింది. ఈ నేపథ్యంలో భారతదేశం లాంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు ధనస్వామ్యంగా, నేరస్వామ్యంగా మారినాయనే ఆందోళన కలుగక మానదు.
18వ లోక్ సభకు ఎన్నికైన మొత్తం 543 మంది లోక్ సభ సభ్యులలో 504 మంది అంటే 93 శాతం సభ్యులు కోటీశ్వరులే అని ఏడీఆర్ తన నివేదికలో వెల్లడించింది. అలాగే వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న బీజేపీ నుండి 240 మంది లోక్ సభ సభ్యులు విజయం సాధిస్తే వారిలో 227 మంది లోక్ సభ సభ్యులు కోటీశ్వరులే. అలాగే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుండి 92 మంది కోటీశ్వరులు లోక్ సభ సభ్యులుగా ఎన్నికైనారు. ప్రస్తుత ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలక భాగస్వామ్య పక్షాలైన టీడీపీ నుండి గెలిచిన 16 మంది లోక్ సభ సభ్యులూ, జేడీ(యూ) నుండి గెలిచిన 12 మంది సభ్యులూ... అందరూ కోటీశ్వరులే!
2009 లోక్ సభ ఎన్నికల నుండి ప్రతి ఎన్నిక లోనూ ఎన్నికయ్యే కోటీశ్వరుల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతూనే ఉన్నదని గణాంకాలు చెబుతున్నాయి. 2009లో 315 మంది, 2014లో 443 మంది, 2019లో 475 మంది, 2024లో 504 మంది కోటీశ్వరులు ఎన్నికయ్యారు.
లోక్ సభకు ఎన్నికవుతున్న వారిలో ఒకపక్క కోటీశ్వరుల సంఖ్య పెరుగుతుంటే మరొకవైపు క్రిమినల్స్, క్రిమినల్ కేసులు, క్రిమినల్ రికార్డ్స్ ఉన్నవారు కూడా పెరిగిపోవటం ఆందోళన కలిగించే విషయమే. 18వ లోక్ సభలో క్రిమినల్ కేసులు ఉన్నవారు 50 శాతం, క్రిమినల్ రికార్డ్స్ ఉన్నవారు 46 శాతం మంది లోక్ సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిలో బీజేపీ నుండి 94 మంది, కాంగ్రెస్ నుండి 49 మంది లోక్ సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. మరీ ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే మహిళలపై దాడులూ, అత్యాచారాలూ చేసిన 15 మంది, విద్వేషపు ప్రసంగాలు చేసే 43 మంది కూడా లోక్ సభ సభ్యులుగా ఎన్నికవ్వటం.
కోటీశ్వరులు, నేరగాళ్లు, క్రిమినల్ రికార్డ్స్ ఉన్నవారు, బ్యాంకులకు డబ్బులు ఎగవేతదారులు లోక్‌సభ లాంటి అత్యున్నత విధాన నిర్ణాయక సభలలోకి అడుగుపెడుతుంటే... సభలో వారి సంఖ్య పెరుగుతుంటే, ఆ సభకి గౌరవం పెరుగుతుందా? పేదల స్థితిగతులు, సమస్యలు వారికి అవగతం అవుతాయా? చట్టసభలలో జరిగే చర్చలలో వారు పాల్గొంటారా? పాల్గొన్నా సహేతుకమైన సూచనలు చేస్తారా! అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి చట్టసభలకు నేరగాళ్ళనూ, సొంత లాభాల కోసం వ్యాపారాలు చేసే కార్పొరేట్లనూ కాకుండా దేశ అభివృద్ధి కోసం పేదల సంక్షేమం కోసం పనిచేసే వారిని ప్రజలు ఎన్నుకునే రోజులు రావాలని ఆశిద్దాం.
డా‘‘ తిరునహరి శేషు
వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,
కాకతీయ విశ్వవిద్యాలయం ‘ 98854 65877
Comments
Please login to add a commentAdd a comment